రాజకీయ దురుద్దేశంతోనే తమ పార్టీ అధినేత చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చామని, ల్యాండ్ పూలింగ్ 2015లో జరిగితే దానిపై ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపేనని అన్నారు. సీఎం జగన్ నేటికీ సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములు వాడుకుంటున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న చరిత్ర ముఖ్యమంత్రిదని అన్నారు.
దశాబ్ధాలు తరబడి ఇడుపులపాయలో అసైన్డ్ భూములు 700 ఎకరాలకను 30 ఏళ్లు అనుభవించారని, ఆ విషయం బయటపడటంతో 610 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నానని నాడు అసెంబ్లీలో వైఎస్ చెప్పారని గుర్తు చేశారు. వాన్ పిక్ భూములు లాక్కుని రైతులకు పరిహారం నేటికీ ఇవ్వలేదన్నారు. సోలార్ కంపెనీలు అవసరాలకు అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అసైన్డు భూముల బదిలీ నిషేధ చట్టాన్ని 2007లో సవరించి ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తెచ్చింది జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా అంటూ అచ్చెన్న ప్రశ్నించారు.