ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏపీలో చాపకింద నీరులా బ్లాక్ ఫంగస్' - బ్లాక్ ఫంగస్ తాజా వార్తలు

ఏపీలో బ్లాక్ ఫంగస్​తో ఐదుగురు మృతి చెందటం బాధాకరమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి చికిత్సకు ప్రభుత్వమే ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు.

Achennaidu
Achennaidu

By

Published : May 18, 2021, 3:02 PM IST

రాష్ట్రంలో చాప కింద నీరులా బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతుండటంతో ఐదుగురు చనిపోయారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ వ్యాధి చికిత్సకు రూ.10లక్షలు వరకూ ఖర్చవుతోందని, ప్రభుత్వమే పూర్తిగా ఆ వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు.

"బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకి కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలలో ఒకరు మృతి చెందారు. 23 మందికి వ్యాధి సోకితే, ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 12మంది, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో 11మందికి ఈ వ్యాధి సోకటం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి చికిత్సకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చే మొత్తం ఎంత మాత్రం సరిపోదు. మహారాష్ట్ర, దిల్లీ రాష్ట్రాలు చేపట్టిన చర్యలతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

సీఎం జగన్ అనాలోచిత చర్యలతోనే రాష్ట్రంలో కరోనా రెండో దశ విశ్వరూపం చూపిస్తోంది. ముఖ్యమంత్రి తన రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కనపెట్టి కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలి. కరోనా నియంత్రణ చర్యలు చేపట్టకుండా రాజకీయ ప్రత్యర్థులపై కక్షతీర్చుకునేందుకే జగన్ రెడ్డి సమయం వృథా చేస్తుండటం విచారకరం. అనంతపురంలో జిల్లా స్థాయి అధికారి సుబ్బారాయుడు ఆక్సిజన్ అందక మృతి చెందటం బాధాకరం. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ప్రధానికి లేఖలు రాయడం వల్ల ప్రయోజనం లేదు. రాష్ట్రప్రభుత్వ చేతగానితనం వల్లే వ్యాక్సిన్ ప్రక్రియ అధ్వాన్నంగా ఉంది. కొవిడ్ వ్యాధిని అరికట్టేందుకు కీలకమైన వ్యాక్సినేషన్ లో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైంది." అని ఓ ప్రకటనలో విమర్శించారు.

ఇదీ చదవండి:

పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు.. జిల్లాలో 100 మందికి చికిత్స..!

ABOUT THE AUTHOR

...view details