ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల కోసం ఔషధాలు, సర్జికల్ పరికరాలు కొనుగోలులో ఏ విధానాన్ని అమలు చేశారు? ఓపెన్ టెండర్లు పిలిచారా? ఈ ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లారా? కొటేషన్లు తీసుకున్నారా? ఎల్ 1 బిడ్లను ఎలా ఎంపిక చేశారు? అంటూ ఐఎంఎస్ పూర్వపు డైరెక్టర్లు డా.జి. విజయ్ కుమార్‌పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఇండెంట్లో లేని ఔషధాలు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది? కడప , విజయవాడలోని స్టోర్లలో వినియోగించకుండా వదిలేసిన మందులు ఎందుకు ఉన్నాయి ? అని ప్రశ్నించి వాటికి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.
191 కోట్ల రూపాయల విలువైన పరికరాల కొనుగోలు కోసం ఒక ఆర్డరును 18 కొనుగోలు ఆర్డర్లుగా విభజించి ఎలాంటి ఓపెన్ టెండర్లు పిలవకుండా టెక్నోమెడ్ సంస్థకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటూ ఆరా తీశారని సమాచారం. ఈఎస్ఐలో ఔషధాలు, సర్జికల్ పరికరాలు, ల్యాబ్ కిట్ల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై అరెస్టైన విశ్రాంత డిప్యూటీ సివిల్ సర్జన్ డా వి.జనార్దన్, ఐఎంఎస్ కార్యాలయ సూపరింటెండెంట్ ఎం. కల్యాణ్ పవన్ చక్రవర్తి , సాయిరామ్ ఫార్మాసిటికల్స్ యజమాని గోనె వెంకట సుబ్బారావులను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం వరుసగా రెండో రోజు విచారించారు.