తెలంగాణలో ఓటుకు నోటు కేసు విచారణ కీలక దశకు చేరింది. నిందితుల్లో ఒకరైన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై అనిశా న్యాయస్థానం విచారణ ప్రక్రియ ప్రారంభించింది. సండ్ర వెంకట వీరయ్యపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12తో పాటు.. ఐపీసీ 120బీ రెడ్విత్ 34 కింద న్యాయస్థానం అభియోగాలను నమోదు చేసింది. సండ్ర వెంకట వీరయ్య డిశ్చార్జ్ పిటిషన్ను హైకోర్టు కూడా కొట్టివేయటంతో.. విచారణ ప్రక్రియ ప్రారంభించింది.
అభియోగాలను సండ్ర వెంకట వీరయ్యకు న్యాయాధికారి చదివి వినిపించారు. లంచం ఇచ్చేందుకు ఇతరులతో కలిసి కుట్ర పన్నినట్లు అనిశా అభియోగాల సారాంశమని సండ్రకు కోర్టు తెలిపింది. తనపై అనిశా అభియోగాలన్నీ తప్పని.. తానెలాంటి నేరం చేయలేదని.. విచారణకు సిద్ధమని సండ్ర వెంకట వీరయ్య న్యాయస్థానానికి తెలిపారు. దీంతో తదుపరి విచారణ కోసం కేసును ఈనెల 22కి వాయిదా వేసింది.