ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో అనిశా ఆకస్మిక తనిఖీలు - తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

రెవెన్యూ అవినీతిపై అనిశా దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు తహసీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది. లెక్కల్లో చూపని రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడమే కాకుండా అవకతవకలను గుర్తించింది.

ACB contingency rides at mro offices across the state
ACB contingency rides at mro offices across the state

By

Published : Jan 25, 2020, 6:09 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని పలు తహసీల్దార్ కార్యాలయాలు రికార్డుల నిర్వహణ, పౌరసేవల విషయంలో తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి. చాలామంది తహసీల్దార్లు మీసేవలో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించకుండా, ఎలాంటి కారణాలు చూపకుండానే తిరస్కరిస్తున్నారు. కొన్ని చోట్ల అధికారుల స్థానంలో ప్రైవేటు వ్యక్తులు కార్యాలయాల్లో పని చేస్తున్నారు. తహసీల్దార్ల వద్ద ఉండాల్సిన 'డిజిటల్​ కీ'ని కూడా కంప్యూటర్ ఆపరేటర్లకే అప్పగిస్తున్నారు. అవినీతిపై 14400 టోల్​ఫ్రీ నంబర్​కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 21 తహసీల్దార్​ కార్యాలయాల్లో అనిశా అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టినప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆంజనేయులు ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించి.... లెక్కల్లో చూపని రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీలు ఎక్కడంటే?

కొత్తూరు, ఎచ్చెర్ల(శ్రీకాకుళం జిల్లా), వేపాడ(విజయనగరం జిల్లా), భీమిలి, సబ్బవరం(విశాఖ జిల్లా), పెదపూడి, పెద్దాపురం(తూర్పుగోదావరి జిల్లా), చింతలపూడి(పశ్చిమ గోదావరి జిల్లా), అవనిగడ్డ, తోటవల్లూరు(కృష్ణా), పొన్నలూరు (ప్రకాశం), సూళ్లూరుపేట, కావలి(నెల్లూరు జిల్లా), వడమాలపేట(చిత్తూరు), బ్రహ్మంగారి మఠం(కడప), ముదిగుబ్బ(అనంతపురం), నాదెండ్ల, భట్టిప్రోలు, మాచర్ల(గుంటూరు), కర్నూలు జిల్లా కల్లూరు కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి.

గుర్తించిన అవకతవకలివీ

  • మ్యుటేషన్, ఇన్​వార్డు ఫిర్యాదులు, వినతులు, స్పందన కార్యక్రమం రిజిస్టర్లు ఎక్కడా సరిగ్గా నిర్వహించడం లేదు
  • కొత్తూరులో జనవరి 1 నుంచి ఒక్కరు కూడా హాజరుపట్టీలో సంతకాలు చేయలేదు. లెక్కల్లో చూపని రూ.44,577 స్వాధీనం
  • భీమిలి తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను అనధికారికంగా నియమించుకుని వారితో అధికారిక విధులు చేయిస్తున్నారు. మ్యుటేషన్​కు 2,465 దరఖాస్తులు వస్తే 1,686 తిరస్కరించారు. వీటిలో కొన్నింటిని పరిశీలించుకుండానే తిరస్కరించినట్లు తేలింది.
  • సబ్బవరం తహసీల్దార్ కార్యాలయంలో 134 ఈ- పాస్​పుస్తకాల్ని, వడమాలపేటలో 43 పాసుపుస్తకాల్ని పంపిణీ చేయకుండా సిబ్బంది తమ దగ్గరే అట్టిపెట్టుకున్నారు
  • పెద్దాపురంలో ఓ వీఆర్వో సొరుగులో రూ.8,500 నగదు దొరికింది
  • చింతలపూడిలో ప్రభుత్వ, అసైన్డు భూముల రికార్డులు కూడా నిర్వహించట్లేదు
  • తమ భూముల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేసుకోవడానికి తిరిగితిరిగి విసిగిపోతున్నామని నాదెండ్ల, మాచర్ల తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చినవారు ఏసీబీ అధికారులకు వివరించారు
  • కల్లూరు తహసీల్దార్ వద్ద ఉండాల్సిన డిజిటర్ కీ ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ చేతిలో ఉంది.

ఇదీ చదవండి:ఉద్యోగులూ.. పాన్‌ లేకపోతే 20% పన్ను!

ABOUT THE AUTHOR

...view details