తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా (Corona) ప్రభావం ఎక్కువగా కనిపించటం లేదు. ఐటీడీఏ (ITDA) పరిధిలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క కరోనా (Corona) మరణం సంభవించలేదు. అటవీ ప్రాంతానికి ఆనుకొని గ్రామాలు ఉండటం... కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటే తప్ప ఇంట్లోకి వెళ్లకపోవడం... అత్యవసరముంటే తప్ప మరో ఊరికి వెళ్లకపోవడం వంటి వారి జీవన విధానమే... గిరిజన పల్లెల్లో వైరస్ కట్టడికి కారణమైంది.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు...
ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాల పరిధిలో 31 ఏజెన్సీ (Agency) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో వైద్యశాఖ సేవలందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏజెన్సీ పరిధిలో సుమారు లక్షకుపైగా కరోనా (Corona)పరీక్షలు చేయగా... కేవలం 7,269 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. మహమ్మారి బారిన పడి 56 మంది మరణించారు. ఇందులో 11 పీహెచ్సీ (PHC)లను పరిగణలోకి తీసుకుంటే.. 30 వేల పరీక్షలు చేయగా... కేవలం 1,815 మందికి పాజిటివ్ వచ్చింది.
ఒక్క మరణం కూడా సంభవించలేదు. కరోనా (Corona) నియంత్రణలో భాగంగా కొత్తవారెవరూ ఊళ్లకి రాకుండా కర్రలతో ప్రత్యేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవడంతో... మహమ్మారి కట్టడి సాధ్యమైందని ఆదివాసీలు అభిప్రాయపడుతున్నారు.