అంబులెన్స్ వస్తుందంటే దారివ్వడం కనీస బాధ్యత. కానీ నగరంలో... అందులోనూ సాయంత్రం సమయంలో మనిషి తప్పుకునేందుకు చోటు దొరకదు. అలాంటి సమయంలో అంబులెన్స్‌ను ఆస్పత్రికి పంపించడంలో ఓ కానిస్టేబుల్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. ఆ సమయంలో అతడు స్పందించిన తీరుపై ఉన్నతాధికారులు అభినందించారు.
పరిగెడుతూ అంబులెన్స్‌కు దారి... వీడియో వైరల్ - కానిస్టేబుల్ సమయస్ఫూర్తి... నిలబెట్టిందో నిండు ప్రాణం
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని తీసుకెళ్తున్న అంబులెన్సును సకాలంలో ఆసుపత్రికి చేర్చి మానవత్వం చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బాబ్జీ సకాలంలో స్పందించి ఓ నిండు ప్రాణం కాపాడాడు.
![పరిగెడుతూ అంబులెన్స్‌కు దారి... వీడియో వైరల్ traffic Constable Seved a Life in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9434063-975-9434063-1604509920703.jpg)
హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాబ్జీ... మొజంజాహి మార్కెట్ నుంచి కోఠి వెళ్లే దారిలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడాన్ని గమనించాడు. ట్రాఫిక్‌లో వాహనాలను తప్పించేందుకు వాహనం ముందు పరుగెడుతూ... 108 వాహనానికి దారి క్లియర్ చేశాడు. సకాలంలో ఆస్పత్రికి చేరడం వల్ల రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ మేరకు రోగి బంధువులు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. కానిస్టేబుల్ బాబ్జీ సమయస్ఫూర్తికి పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.