కర్నూలు జిల్లా నంద్యాల కు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై సీబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ.. అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి నేడు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపాతో పాటు... కాంగ్రెస్, బీఎస్పీ, ముస్లిం లీగ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విజయవాడ, గుంటూరు, కడప, విశాఖపట్టణం, ముస్లిం సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో.. గత రాత్రి నుంచి పోలీసులు ఎక్కడికక్కడ ముస్లిం సంఘ నాయకులను, తెదేపా నేతలను గృహ నిర్భంధాలు చేస్తున్నారు. విజయవాడలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యతో పాటు మరికొందరు నేతలకు ముందస్తు నోటీసులిచ్చి గృహనిర్బంధం చేశారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన పలువురు ముస్లిం సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
సీపీఐ మద్దతు
ముస్లిం మైనారిటీ సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీకి సీపీఐ మద్దతు తెలిపింది. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని పార్టీ నేత రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపుల కారణంగానే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.