ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత
14:38 May 22
విధుల్లోకి తీసుకోవాలని ఆదేశం
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రక్షణ పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీనిపై ఏబీవీ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా క్యాట్ ఆయన సస్పెన్షన్‌ను సమర్ధించింది. దీనిపై ఏబీవీ వేసిన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆయనపై క్యాట్ ఉత్తర్వులను ఎత్తివేస్తూ ఆదేశాలిచ్చింది. సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ జోక్యం చేసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై విచారణ జరిగింది. సస్పెండ్ నిమిత్తం సాధారణ పరిపాలనశాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 8న జారీచేసిన జీవో 18 , మార్చి 17న క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో 18ని జారీచేసింది. దానిని సవాలు చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. సస్పెన్షన్ పై క్యాట్ జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో హైకోర్టుని ఆశ్రయించారు. సస్పెన్షన్ చేసే ముందు ఆరోపణలు నిరూపించాల్సి ఉండగా పిటిషనర్ విషయంలో భిన్నంగా వ్యవహరించారన్నారు. హఠాత్తుగా సస్పెండ్ చేశారన్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిటిషనర్‌ను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్ చేయాలని తెలిపిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దురుద్దేశంతో కక్షసాధింపుగా పిటిషనర్‌ను సస్పెండ్ చేశారన్నారు. గతేడాది మే 30 నుంచి సస్పెండ్ చేసిన తేదీ మధ్య కాలానికి జీతం చెల్లించలేదన్నారు. సస్పెండ్ చేశాక జీవనోపాధి భత్యం చెల్లించలేదన్నారు . ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తెదేపా హయాంలో నిఘా విభాగంలో పని చేశారు.