హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ బాలిక ఘటన మరవకముందే మరో యువతి అత్యాచారానికి గురైంది. ఈ ఘటన బాచుపల్లి పరిధిలోని ప్రగతి నగర్లో జరిగింది. ఈనెల 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. ఇంటి వద్ద దింపుతామని యువతికి మాయమాటలు చెప్పిన స్నేహితుడు అఘాయిత్యానికిి ఒడిగట్టాడు.
అసలేం జరిగిందంటే: ఈ నెల 13న స్నేహితులతో కలిసి రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కి యువతి వెళ్లింది. రాత్రి ఏడున్నర గంటల సమయంలో స్నేహితులందరూ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ ముగిసిన అనంతరం ఆ యువతిని రోషన్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి రాత్రి 11 గంటల సమయంలో ప్రగతి నగర్‌లోని యువతి ఇంటి వద్ద వదిలి వెళ్లాలని నిశ్చయించుకున్నారు.
అనుకున్నట్లుగానే రాత్రి 11.30 గంటలకు యువతిని ఇంటి వద్ద వదిలి తెల్లవారుజాము వరకు అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున రోషన్ స్నేహితులిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం యువతి ఉదయం ఐదు గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించింది. అదే అదునుగా భావించిన రోషన్ ఉదయం 6 గంటల సమయంలో నిద్రలో ఉన్న యువతిపై అత్యాచారం చేశాడు. యువతి వెంటనే తేరుకుని చుట్టుపక్కల వారిని పిలవగానే రోషన్ అక్కడినుంచి పరారయ్యాడని పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.