ప్రేమ పేరుతో (In the name of love) నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తిపై హైదరాబాద్ ఎంఎస్ మక్తాకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూఎస్‌ఏలో మాస్టర్ డిగ్రీ చదువుకుంటున్న తనకు టిండర్ యాప్ (Tinder App)లో ఆదిత్య అనే యువకుడు పరిచయమయ్యాడని తెలిపింది. తనకు రూ.కోట్లు విలువైన ఆస్తులున్నాయని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని బాధితురాలు పేర్కొంది.
పెళ్లి పేరుతో నగరానికి రప్పించాడని... మణికొండలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నామని బాధిత యువతి తెలిపింది. తనను ధర్మశాల, జమ్ముకశ్మీర్, శ్రీనగర్, గోవా తదితర ప్రాంతాల పర్యటనకు తీసుకువెళ్లాడని వివరించింది. తిరిగి వచ్చిన తర్వాత బంజారాహిల్స్‌కు నివాసాన్ని మార్చాడని పోలీసులకు తెలిపింది. నాలుగు రోజుల కిందట ఎంఎస్ మక్తాలో ఉన్న తన తండ్రి పుట్టిన రోజు వేడుకలకు తాను వెళ్లగా ప్రియుడు ఆదిత్య బెంగళూరుకు వెళుతున్నానని చెప్పి వెళ్లాడని ఎంతకు తిరిగి రాలేదని వాపోయింది.