ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం - narayanaguda

నాన్న ఎందుకు లేవడం లేదో తెలియట్లేదు. అమ్మ ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు. అందరూ వాళ్లను చూసి ఎందుకు భయపడుతున్నారో అంతుబట్టడం లేదు. నెలరోజుల పసికందు పాలకోసం గుక్కపట్టి ఏడవటం అక్కడెవరి మనసుకూ వినిపించ లేదు. ముగ్గురు పిల్లల కన్నీరు అక్కడెవరికీ కనిపించ లేదు. నారాయణగూడ బొగ్గులకుంట కూడలిలో కనిపించిన కన్నీటి గాథ ఇది...

a tragic incident in hyderabad
కాలిబాటపై మృతదేహం

By

Published : May 2, 2020, 10:57 AM IST

Updated : May 2, 2020, 11:21 AM IST

హైదరాబాద్ నారాయణగూడలోని బొగ్గులకుంట కూడలిలోని కాలిబాటపై గురువారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న అబిడ్స్‌ ఏసీపీ భిక్షంరెడ్డి, నారాయణగూడ డీఐ రవికుమార్‌, అడ్మిన్‌ ఎస్సై కరుణాకర్‌రెడ్డి, ఎస్సై నవీన్‌కుమార్‌, సైదులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.

మృతుడి చొక్కా జేబులో ఓ చీటీ లభించింది. అందులో కరోనా అనుమానంతో కింగ్‌కోఠి ఆసుపత్రికి వచ్చాడని.. తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించినట్లుగా ఉంది.

అతడిని బోడుప్పల్‌కు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌(45)గా గుర్తించి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో తామే కింగ్‌కోఠి ఆసుపత్రికి తరలించినట్లు వారు స్పష్టం చేశారు.

అనంతరం మృతుడి భార్య, ముగ్గురు చిన్నారులను(అందులో ఒకరికి నెలరోజుల వయసు) ఆటోలో బొగ్గులకుంటకు పంపించారు. తమది కర్ణాటకలోని బీదర్‌ అని, పొట్టకూటి కోసం నగరానికి వచ్చామని, కొంతకాలంగా తన భర్త క్షయవ్యాధితో బాధపడుతున్నట్లు మృతుడి భార్య తెలిపింది.

మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కిస్తుండగా చూసిన పిల్లలు ‘అమ్మా... నాన్నకు ఏమైంది. ఎక్కడకు తీసుకెళుతున్నారు’.. అంటూ ప్రశ్నలు కురిపిస్తుంటే ఏం చెప్పాలో, వారిని ఎలా ఓదార్చాలో తెలియక ఆమె రోదించింది.

రాత్రికి రాత్రే అంత్యక్రియలు.. గాంధీ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపర్చలేమని అధికారులు తెలపడంతో నారాయణగూడ పోలీసులు జీహెచ్‌ఎంసీని సంప్రదించి దహన సంస్కారాలకు ఏర్పాటు చేశారు. భార్య, మేడిపల్లి పోలీసుల సమక్షంలో రాత్రికి రాత్రే దహన సంస్కారాలు పూర్తి చేశారు. తల్లీపిల్లలను వారి స్వస్థలం బీదర్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి:రాష్ట్రంలో.. లక్ష దాటిన కరోనా పరీక్షలు

Last Updated : May 2, 2020, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details