ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kakatiya Culture and Arts: రౌద్రం.. లాస్యం.. నృత్యం.. - కాకతీయుల కళలు సంస్కృతి పై ప్రత్యేక కథనం

Kakatiya Culture and Arts: కాకతీయుల కళలు, సంస్కృతి ఇంకా సజీవంగా ఉన్నాయనడానికి పేరిణి, కూచిపూడి నృత్య ప్రదర్శనలే నిదర్శనం. రాజ్యపాలనలోనే కాదు.. కళల ప్రోత్సాహంలోనూ తమకెదురులేదని చాటారు. వారు నిర్మించిన ఆలయాలన్నిటిపై ఈ కళాకృతులు కనిపిస్తాయి. వాటిపై ఈటీవీ-భారత్ ప్రత్యేక కథనం.

Kakatiya Culture and Arts
Kakatiya Culture and Arts

By

Published : Jul 7, 2022, 9:08 AM IST

Kakatiya Culture and Arts: పేరిణి నృత్యంలోని మృదంగ నాదంలో ప్రత్యేకత ఉంటుంది. ఓవైపు మృదంగం ధ్రుపదపాదం ఢం..ఢం.. అంటూ వాయిస్తుంటే.. వెనకాల తాం తకిట తాం తకిట, తాం తకిట అంటూ ఓంకార నాదం వినిపిస్తుంది.. కాళ్ల గజ్జెలు ఘల్లుమంటుంటే.. కాటుక కళ్లు రౌద్రాన్ని జ్వలిస్తాయి. కదన రంగంలో కాలిడిన సైనికుడు కత్తి, డాలును తిప్పుతూ ధీరత్వాన్ని ప్రదర్శించినట్లుగా ఈ నృత్యంలో కళాకారుడు తన హావభావాలను పలికిస్తారు.

సైన్యం ప్రేరణకు పేరిణి శివతాండవం..

పేరిణి శివతాండవం కాకతీయుల కాలంలో ఓరుగల్లు కేంద్రంగా ఉద్భవించి విస్తరించింది. శివుడి గౌరవార్థం ఈ నృత్యం చేస్తారు. దీన్ని డాన్స్‌ ఆఫ్‌ వారియర్స్‌గా పిలుస్తారు. యుద్ధానికి వెళ్లే సైనికుల్లో పౌరుషాన్ని రగిలించడానికి యోధులు శివుడి విగ్రహం

ముందు పేరిణి (ప్రేరణ) నృత్యం చేసేవారని చరిత్రకారుల అభిప్రాయం.. అందుకు గుర్తుగా రామప్ప ఆలయంపై పేరిణి శివతాండవ శిల్పాలు కనిపిస్తాయి. శివుడి ఢమరుకం శివతాండవంగా ఈ నృత్యంలో రౌద్రం, వీరసం ప్రదర్శిస్తారు. కాళ్లకు గజ్జెలు, కళ్లకు కాటుక శివుడి వేషధారణలో కళాకారులు నవరసాలను ప్రదర్శిస్తారు.

ప్రోత్సాహం అందిస్తే చిరకాలం ఉంటుంది..

'1998 నుంచి పేరిణి నృత్యప్రదర్శనలిస్తున్నాను. 2000 సంవత్సరంలో నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ’ స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎందరో శిష్యులను తీర్చిదిద్దాను. 2017లో 153 మంది విద్యార్థులతో హనుమకొండ జేఎన్‌ఎస్‌లో మెగా పేరిణి నృత్యప్రదర్శనలిచ్చాను. ఈ నెల 7న 111 మంది శిష్యులతో పేరిణి స్వాగత నృత్యం ప్రదర్శిస్తున్నాను. కాకతీయ వైభవం చిరకాలం ఉన్నట్లే వారి కళలు బతకాలంటే ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి.' - గజ్జెల రంజిత్‌కుమార్‌

అచ్చ తెలుగు పేర్లు..కాకతీయుల పేర్లలో తెలుగుదనం కనిపిస్తుంది. బేతరాజు అనే పేరు పోతురాజు నుంచి వచ్చిందే. ఈ పేరుకు పంటలకు చీడపీడలు రాకుండా పూజించే దేవుడనే అర్థం వస్తుంది. పోలరాజు ప్రోచేరాజు అనే పదం నుంచి వచ్చింది. పూజలందుకును దేవత అనే అర్థం వస్తుంది. మైలమ అంటే భూదేవి, బయ్యలమ్మ అంటే చదువుల తల్లి, ముమ్మడమ్మ అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ అనే తెలుగు అర్థాలు ఉన్నాయి.

ముగ్ధ మనోహరం..

భారతీయ శాస్త్రీయ సంగీత పదజాలం తాళం.. శబ్ద ఉత్పత్తిపరంగా శివుడు, పార్వతీదేవి నృత్యాల కలయిక నుంచి ఉద్భవించిందే పేరిణిలోని లాస్య నృత్యం.. శివుడి శక్తికి ప్రతిస్పందనగా పార్వతి ఈ నృత్యం చేసిందని ప్రతీతి. ఆనందకరమైన వ్యక్తీకరణతో పురుషుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ మనోహరంగా సాగుతుంది.

యక్షగాన రూపంలో ‘కూచిపుడి’..

కాకతీయుల కాలంలో యక్షగాన రూపంలో మొదట ఆవిర్భవించింది నేటి కూచిపూడి నృత్యం. ఇందులో భక్తుడు దైవంలో ఐక్యమయ్యే కాంక్షను తెలియజేసే సాహిత్యం ఉంటుంది. ఈ నృత్యం కృష్ణా జిల్లా కూచిపూడి నుంచి విశ్వవ్యాప్తం కావడం వల్ల కూచిపూడి నృత్యంగా పేరొచ్చిందంటారు. కాకతీయ సామ్రాజ్యానికి చెందిన విశ్వకర్మ సిద్దేంద్రయోగి క్షేత్ర పర్యటనలో భాగంగా కూచిపూడి గ్రామం చేరుకొని అక్కడ బ్రాహ్మణుల ఇంట ఆతిథ్యం స్వీకరించి వారి కోరిక మేరకు అక్కడి వారి పిల్లలకు ఈ నృత్యవిద్యను నేర్పిస్తారు. అలా కూచిపూడిలో మొదలైంది.

*కూచిపూడి త్రయంగా పేరు తెచ్చుకున్న వెంపటి వెంకటనారాయణశాస్త్రి, చింతా వెంకటరామయ్య, వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి ఈ నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు. వెంకటనారాయణశాస్త్రి కుమారుడు వెంపటి కోదండరామశాస్త్రి 1967లో ఓరుగల్లు వచ్చి తిరిగి కూచిపూడి శిక్షణ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ నృత్యాన్ని వెంపటి వెంకటనారాయణ నృత్య కళాక్షేత్రం ద్వారా డాక్టర్‌ శాంతి కృష్ణ ఆచార్య, శ్రావణి వరంగల్‌ నగరంలో విస్తృత పరుస్తున్నారు.

మా మాటే ‘శాసనం’..

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరులో ఇటీవల కాకతీయుల నాటి శాసనాల్ని కనుగొన్నారు. ఇక్కడ గణపతి దేవుడు రాయించిన శాసనంతోపాటు ఆయన మనుమడు ప్రతాపరుద్రుడు కూడా అక్కడే శాసనం వేయించారు. ఇద్దరి రాజుల మధ్య 105 సంవత్సరాల తేడా ఉన్నా, ఒకే శిలపై వారి శాసనాలు ఉండటం విశేషం. 1198 ఏప్రిల్‌ 21న మంగళవారం శ్రీగోపీనాథ తిరు ప్రతిష్ఠ చేశారు. ఈ విషయాన్ని ఒక అడుగు మందం, ఆరడుగుల ఎత్తు ఉన్న గ్రానైట్‌రాయిపై ఒకవైపు 47 వరుసల్లో వివరంగా రాసిపెట్టారు. అదే రాయిపై 1303 ఆగస్టు 2 గురువారం ప్రతాపరుద్రుడు శాసనం రాయించారు. ఈ కట్టకూరు శాసనం ప్రకారం గణపతి దేవుడు 1198 ఏప్రిల్‌ 21 కంటే ముందే హనుమకొండ సింహాసనంపై ఉన్నట్లు చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు.

వీరనారులు నాటి మహిళలు..

శిల్ప సౌందర్యం..కాకతీయులంటే వీరత్వానికి ప్రతీక. పురుషులే కాదు స్త్రీలు సైతం యుద్ధరంగంలో దూకేవారు. రాణి రుద్రమనే ఇందుకు సాక్ష్యం. మరోవైపు సైనికులే కాదు. మహిళలు కూడా ధైర్యంలో, పౌరుషంలో, యుద్ధాల్లో వీరనారులుగా గుర్తింపు పొందారు. అందుకు ప్రతీకగా రామప్ప ఆలయం మీద వీరనారుల శిల్పాలు దర్శనమిస్తున్నాయి. ఏనుగులతో సైతం యుద్ధం చేస్తున్నట్లు ఒక చేతిలో డాలుతో ఏనుగును కట్టడి చేస్తున్నట్లు, మరో చేతిలో కత్తితో పోరాడుతున్నట్లు చెక్కారు.

మూడు తరాలుగా శిక్షణ..

'మూడు తరాలుగా వందలాది మందికి కూచిపూడినృత్యంలో శిక్షణ ఇస్తున్నాం. 2019లో శాంతికృష్ణ సేవా సమితి ద్వారా తెలుగు జానపద చరిత్రలో మొదటిసారి బతుకమ్మతల్లి మహాబృంద నృత్యం ద్వారా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాం.'- వంగాల శాంతి కృష్ణ ఆచార్య

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details