తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండకు చెందిన పదకొండేళ్ల బాలుడే ఈ కథలో ప్రధాన పాత్ర(సూత్ర)ధారి. ప్రస్తుతం జాకారం సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా సుమారు రెండేళ్లుగా ఇంట్లోనే ఉన్న బాలుడు.. ఈ మధ్యే హాస్టల్‌కు వెళ్లాడు. ఇంట్లో అమ్మతో ఉండటం అలవాటైన తనకు.. హస్టల్ ఉండటం కష్టమనిపించి మళ్లీ ఇంటికి వచ్చేశాడు. సుమారు నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. తనకు బాగా అలవాటైన కుమారునికి తనపై బెంగగా ఉందేమో అని తలచిన ఆ పిల్లాడి అమ్మ.. కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచుకుని తర్వాత పంపిస్తాననుకుంది. చాలా రోజులు కావటంతో.. ఈ నెల నాలుగున హాస్టల్‌కి వెళ్లాలని పిల్లాడికి ముందే చెప్పింది.
హాస్టల్‌కు వెళ్లాల్సిన రోజు ఉదయం..
నాలుగో తేదీ ఉదయం.. "ఇయ్యాల నువ్వు హాస్టల్‌కు పోవాలె గదా.. జల్ది పోయి నీకిట్టమైన టిపిన్ చేశి రా.. పో బిడ్డా.." అని డబ్బులు ఇచ్చి పంపించింది తల్లి. హాస్టల్‌కు వెళ్లటం ఎంత మాత్రం ఇష్టం లేని ఆ పిల్లాడు.. టిఫిన్ సెంటర్‌కు కాకుండా నేరుగా నడుచుకుంటూ వెళ్లాడు. పెట్రోల్ బంకు ముందు వరకు వెళ్లి.. అక్కడ ఓ బస్సు ఎక్కాడు. ఇదే పెట్రోల్ బంకు దగ్గర ఈ పిల్లాడితో పాటు వెంకటేశ్వర్లపల్లికి చెందిన ఐటీఐ కళాశాల విద్యార్థి రవితేజ కూడా అదే బస్ ఎక్కాడు. ఈ అబ్బాయిని ఒంటరిగా చూసిన రవితేజ.. "ఒక్కడివే ఏడికి పోతున్నవ్ చిన్నా..?" అని అడిగాడు. "తాత మంచిగ లేడు. పరకాల దవఖానాల ఉన్నాడు. అమ్మగుడ ఆన్నే ఉంది. నేను ఆడికే వోతున్న".. రవితేజ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు పిల్లాడు. అన్నట్టుగా పరకాలలో బస్సు దిగాడు. ఆ తర్వాత టాటా మ్యాజిక్ వాహనంలో హన్మకొండకి వెళ్లాడు.
భయంలోనూ మెరిసిన ఐడియా..
అయితే హన్మకొండలో ఆ పిల్లాడి అక్క ఉంటుంది. తన అక్క దగ్గరకు వెళ్దామనుకున్నాడు. హన్మకొండలో దిగే వరకు అంతా బాగానే ఉంది. కానీ.. అసలు సమస్య అప్పుడు మొదలైంది. అక్క ఇంటి అడ్రస్ మర్చిపోయి.. పిల్లాడు చిక్కుల్లో పడ్డాడు. ముందు చూస్తే నుయ్యి.. వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది పిల్లాని పరిస్థితి. "అక్క ఇంటికి పోదామంటే అడ్రస్ యాదిలేదు. పోనీ.. మళ్లా ఇంటికి పోతే.. ఇట్ల జేశినందుకు అమ్మ, అన్న.. పొట్టుపొట్టు కొడతరు.." లోలోపలే మాట్లాడుకుంటూ భయపడుతున్నాడు. అంత క్లిష్టమైన పరిస్థితిలోనూ ఆ పిల్లాడికి టింగ్‌మంటూ ఓ ఐడియా తట్టింది. "గీ ఐడియా మస్తుందిరా బై.. ఇది గిట్ల జేస్తే.. అటు అమ్మ, అన్న ఏం అనకపోవుడే గాదు.. ఇగ హాస్టల్‌కు గుడ పంపియ్యరు.." అని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు.