ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలోని మునుగోడు సమరానికి అభ్యర్థులు రె'ఢీ'.. పాత ప్రత్యర్థుల కొత్త పోరు.. గెలిచేదెవరు?

A new battle between old rivals in munugode election: తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఎన్నికలో మళ్లీ పాత ప్రత్యర్థులే.. కొత్తగా పోటీ చేస్తున్నారు. దీంతో ఈ వర్గాల మధ్య పోరు ఆసక్తిగా మారిపోయింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి మూడు పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తాజాగా అభ్యర్థులు ఖరారు కావడంతో భారీగా నామినేషన్ల కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

Munugode By Poll Candidates
మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థులు

By

Published : Oct 8, 2022, 1:36 PM IST

A new battle between old rivals in munugode election: మునుగోడు నియోజకవర్గంలో పాత ప్రత్యర్థుల మధ్య కొత్త పోరు కొనసాగనుంది. తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి తెరాస శుక్రవారం బీ ఫారం అందజేసింది. దీంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. భాజపా అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున పాల్వాయి స్రవంతి బరిలో దిగనున్నారు.ఈ ముగ్గురూ పాత ప్రత్యర్థులే కావడం గమనార్హం. 2014 ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (తెరాస), పాల్వాయి స్రవంతి (స్వతంత్ర) మధ్య ప్రధాన పోటీ కొనసాగింది. 2018 ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌)లు పోటీ పడ్డారు.

తాజాగా ఈ ముగ్గురు నేతలు ఈ బరిలో ఉండటంతో మునుగోడు పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు జరుగుతున్న కీలక ఉప ఎన్నిక కావడంతో తెరాస, భాజపా, కాంగ్రెస్‌లకు ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇప్పటికే మూడు పార్టీలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. రెండు నెలలుగా ఎన్నికల సందడి కొనసాగుతోంది. తాజాగా అభ్యర్థులు ఖరారు కావడంతో భారీగా నామినేషన్ల కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

ఆచితూచి అభ్యర్థుల ఎంపిక..రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపా తరఫున పోటీలో ఉన్నారు. తెరాస, కాంగ్రెస్‌లు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాయి.విస్తృతమైన సర్వేలు చేయడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సంప్రదించి.. క్షేత్రస్థాయి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభాకర్‌రెడ్డి, స్రవంతిలను అభ్యర్థులుగా ప్రకటించాయి. పార్టీ నేతలకు నచ్చజెప్పడంతో పాటు వీరి అభ్యర్థిత్వాలపై తీవ్ర వ్యతిరేకత లేకుండా చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీల నుంచి అటూ ఇటూ మారినా గ్రామీణ ప్రాంతనేతలు జారిపోకుండా దృష్టిసారించాయి.

తొలిసారి బరిలో లేని సీపీఐ..మునుగోడులో బీఎస్పీ అభ్యర్థిని బరిలో దించుతుండగా, ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్‌ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పలువురు స్వతంత్రులు పోటీకి సిద్ధమవుతున్నారు. 1967 నుంచి ప్రతిసారీ పోటీచేస్తున్న సీపీఐ ఈసారి బరిలో దిగలేదు. వామపక్షాలు తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

అయిదుసార్లు.. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి.. 1952 నుంచి చిన్నకొండూరు నియోజకవర్గంగా ఉండగా 1967లో మునుగోడుగా మారింది. 1967 నుంచి 1983 వరకు వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. 1985 నుంచి 1994 వరకూ మూడుసార్లు సీపీఐ అభ్యర్థి నారాయణరావు గెలుపొందారు. 1999లో మళ్లీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. 2004లో పల్లా వెంకట్‌రెడ్డి (సీపీఐ), 2009లో యాదగిరిరావు (సీపీఐ), 2014లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (తెరాస), 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌) గెలిచారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details