తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో కన్నబిడ్డనే కిరాతకంగా హత్య చేసింది ఓ తల్లి. చంపిన తర్వాత ఇంటి పక్కనే ఉన్న ఇసుక కుప్పలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నాగమ్మ తన కుమారుడైన శివను తల్లి బుచ్చమ్మతో కలిసి కత్తితో పొడిచి, తాడుతో గొంతుకు ఉరివేసి హత్య చేశారు. వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగినా బయటకు పొక్కలేదు. ఆందోళనకు గురైన నాగమ్మ విషయాన్ని సర్పంచ్ లతకు చెప్పగా... ఆమె పోలీసులకు సమాచారం అందించారు.
గ్రామానికి చేరుకున్న పోలీసులు హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. సోమవారం మృతదేహాన్ని బయటకు తీయనున్నారు. హత్యకు గల కారణాలు ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ కిరణ్ కుమార్, సీఐ సీతయ్య, ఎస్ఐ నాగశేఖర రెడ్డి పరిశీలించారు.