బెజవాడ బస్టాండ్‌లో బిక్కుబిక్కుమంటూ దీనంగా చూస్తున్న ఈ వృద్ధురాలిది చిత్తూరు జిల్లా కుప్పం. కన్నవారు వదిలించుకోవడంతో.. కొంతకాలంగా ఈ బస్టాండే ఈమె ఆవాసమైంది. ప్రయాణికులు దయతో ఇచ్చే డబ్బుతోనే పొట్ట నింపుకుంటోంది. వయసు మీద పడి యాచించడం కూడా చేతకాని స్థితిలో ఉన్న ఈ అవ్వ.. పిల్లలు పెట్టిన కష్టాలు తలచుకుని.. ఏడవని రోజంటూ లేదు. కొన్ని రోజుల క్రితం బస్టాండ్‌కు వచ్చిన వృద్ధురాలు.. తీవ్ర జ్వరంతో లేవలేని స్థితికి చేరుకుంది. సాయం చేయాలని.. కనిపించిన వారందరినీ కన్నీటితో వేడుకుంటోంది.
వృద్ధురాలి దీనస్థితిని చూసిన ఆర్టీసీ సిబ్బంది.. ఆమెకు మందులు తెప్పించి ఇచ్చారు. అల్పాహారం తినిపించి ఆకలి తీర్చారు. కాస్త నీరసం తగ్గాక.. గద్గద స్వరంతో ఆమె చెబుతున్న వివరాలు విని ఆవేదన చెందారు. తనది చిత్తూరు జిల్లా కుప్పం అనీ.. కుమారుడిని కష్టపడి చదివించి వివాహం చేశానని ఆమె వివరించింది. తన పేరిట ఉన్న పొలాన్నీ వారికే ఇచ్చానని అవ్వ చెబుతోంది. బాగా చూసుకుంటారని ఆశిస్తే.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని కన్నీటి పర్యంతమైంది. స్థానికంగా ఉంటే ఇబ్బందవుతుందన్న ఆలోచనతోనే ఇంత దూరం పంపేశారని అవ్వ వాపోయింది.