Organ Donation in Hyderabad : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సమితిసింగారం పంచాయతీకి చెందిన బానోత్ శ్రీను(33) స్థానిక దుర్గ ఆఫ్‌లోడింగ్ కంపెనీలో విధులు నిర్వహించేవాడు. ఆయనకు భార్య పావని, కుమారుడు ఛత్రపతి, కుమార్తె నవ్యశ్రీ ఉన్నారు. శ్రీను ఈ నెల 22న విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా కూనవరం రైల్వేగేటు దగ్గర తన ద్విచక్రవాహనం ప్రమాదానికి గురవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. మూడు రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయినట్లు బుధవారం ఉదయం నిర్ధారించారు.
Organ Donation in Bhadradri : ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ వైద్య బృందం అవయవ దానంపై శ్రీను కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో అతని రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కంటి కార్నియాలు సేకరించి.. శస్త్ర చికిత్స ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చినట్లు జీవన్‌దాన్ ఇన్‌ఛార్జి స్వర్ణలత వెల్లడించారు. కన్న కొడుకు చనిపోయాడన్న బాధను దిగమింగుకొని ఆ తల్లిదండ్రులు తమ కొడుకు అవయవాలను ఇతరులకు దానం చేసిన వారి ఔన్నత్యాన్ని పలువురు అభినందించారు. తనతో ఏడడుగులు వేసిన భర్తకు చెందిన అవయవాలను ఆరుగురికి ఇచ్చేందుకు అంగీకరించిన పావని ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నారు.