లాక్‌డౌన్ నేపథ్యంలో స్వస్థలానికి బయలుదేరిన క్రమంలో తన ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మండపల్లి మండలం పుట్లచెరువు గ్రామానికి చెందిన పేడాడ శ్రీనివాసరావు(21) చిత్తూరు జిల్లా నగరిలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో తన ద్విచక్రవాహనంపై మార్చి 31వ తేదీన నగరి నుంచి స్వస్థలానికి బయల్దేరాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గుంటూరు-ప్రకాశం జిల్లాల సరిహద్దు స్టూవర్టుపురం చెక్‌పోస్టు వద్దకు రాగానే వెదుళ్లపల్లి పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసిన అనంతరం యువకుడిపై కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తుపై అదే రోజు రాత్రి శ్రీనివాసరావుని పోలీసులు విడిచిపెట్టారు.
'నా చావుకు పోలీసులే కారణం'
తన చావుకు పోలీసులే కారణమంటూ కృష్ణా జిల్లాకు చెందిన పేడాడ శ్రీనివాసరావు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తనతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని.. తన మరణానికి వెదుళ్లపల్లి పోలీసులే కారణమంటూ చనిపోయేముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
పోలీస్‌స్టేషన్ నుంచి వెళ్లిన శ్రీనివాసరావు మరుసటి రోజు ఉదయం బాపట్ల పట్టణంలోని కొత్తబస్టాండు ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తనతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని.. తన మరణానికి వెదుళ్లపల్లి పోలీసులే కారణమంటూ చనిపోయేముందు శ్రీనివాసరావు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల వల్లే శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు