Heavy rain in AP : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో.. రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు కోనసీమ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమలాపురం సహా 22 మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. సింగంపల్లిలోని ప్రధాన రహదారిపై మోకాల్ల లోతు నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల్లో..ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. V.R. పురం, చింతూరు మండలాల మధ్య ఉన్న బ్రిడ్జి వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గుంటూరు జిల్లాలోనూ వానలు పడుతున్నాయి. ఫిరంగిపురం వీధుల్లో వర్షపు నీరు చేరింది. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక.. ఇళ్ల మధ్యలోనే మురుగు నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురంలో బోరుబావి నుంచి నీరు ఉబికివస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు.. దశాబ్దాలుగా చుక్కనీరు కనిపించని చెరువులన్నీ... నిండుకుండలను తలపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత కంబదూరు చెరువు నుంచి మరవ పారుతోంది.
అల్పపీడనం మరింత బలపడే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఆదివారానికి మరింత బలపడే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి ప్రభావం కూడా కొనసాగుతోంది. దీంతో ఉత్తరకోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల శనివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. ఉత్తరకోస్తాలో ఆదివారం అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయి. కోస్తా, రాయలసీమల్లోని చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.
ఇవీ చదవండి: