ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తల్లిదండ్రులు, అక్కతో బైక్​పై వెళ్తూ.. కళ్లు తెరచి చూసేలోగా' - Family Died in Accident at Nizamabad

అమ్మానాన్న, అక్కతో కలిసి బైక్​పై ఊరికి బయల్దేరింది చిన్నారి... చుట్టు చీకటి... అక్క, తను భయపడకుండా నాన్న కథ చెప్పుకుంటూ బైక్​ నడుపుతున్నారు.. ఇద్దరు హాయిగా కథ వింటూ ఊ కొడుతున్నారు... అంతలో ఒక పెద్ద శబ్ధం వినిపించింది... తెలియకుండానే చిన్నారి కళ్లు మూసుకుపోయాయి. కాస్త తెరిచి అమ్మ, నాన్న, అక్క అంటూ ఎంత పిలిచినా ఎవరూ స్పందించలేదు.. మళ్లీ కళ్లు మూసుకుపోయాయి. తిరిగి కళ్లు తెరవగానే తాను ఆస్పత్రి బెడ్డుపై ఉంది. అప్పుడే తనకు విషయం అర్థమైంది.. తన తల్లిదండ్రులను అక్కను కోల్పోయానని.

Accident
రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

By

Published : May 10, 2022, 12:22 PM IST

Nizamabad Bike Accident: 'అమ్మా.. నాన్న.. అక్క.. నేను బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరాం. అర్ధరాత్రి కావడంతో చాలా చీకటిగా ఉంది. కుక్కల అరుపులు.. పరిసరాలన్నీ నిశబ్ధంగా ఉండటంతో నాకు, అక్కకు చాలా భయమేసింది. మా భయం పోగొట్టాలని నాన్న మాకు కథ చెబుతూ బండి నడుపుతున్నాడు. మేం ఆ కథ వింటూ భయం మరిచిపోయి హాయిగా వెళ్తున్నాం. ఇంతలో గట్టిగా ఏదో శబ్దం వినిపించింది. నాకు తెలియకుండానే కళ్లు మూసుకుపోయాయి. నేను కళ్లు తెరవడానికి మెల్లగా ప్రయత్నించాను. చూసేసరికి అమ్మా.. నాన్న.. అక్క అందరూ ఒక్కో వైపు పడిపోయి ఉన్నారు. నాకు భయమేసింది. అమ్మా.. అమ్మా.. లే అమ్మా అని చాలా ఏడ్చాను. కానీ అమ్మ నా దగ్గరికి రాలేదు. నాన్నను పిలిచాను అసలు వినిపించుకోలేదు. అక్క నాకు చాలా దూరంలో ఉంది. ఓపిక లేకపోయినా చాలా గట్టిగా పిలిచాను. అక్క కూడా నా మాట వినిపించుకోలేదు. అలా వాళ్లని పిలుస్తూ ఎప్పుడు కళ్లు మూశానో తెలియదు.. ఇలా ఆస్పత్రిలో కళ్లు తెరిచాను. రాత్రి జరిగింది యాక్సిడెంట్‌ అని అమ్మా.. నాన్న.. అక్క.. స్పాట్‌లోనే చనిపోయారని తెలిసింది.' - నిజామాబాద్ రోడ్డు ప్రమాదంలో గాయాలతో బయటపడ్డ చిన్నారి

Family Died in Nizamabad Accident : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ కుటుంబాన్ని కారు రూపంలో మృత్యువు వెంటాడింది. కమ్మర్‌పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన క్రిష్ణ, రజిత దంపతులు తమ కుమార్తెలు రాఘవి, శరణ్యలతో వేరే ఊరు బయలుదేరారు.

మార్గమధ్యలో వారి ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తోన్న కారు ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న వాళ్లంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో దంపతులు కృష్ణ, రజిత.. వారి పెద్ద కుమార్తె రాఘవి అక్కడికక్కడే మృతి చెందారు. చిన్న కుమార్తె శరణ్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

స్పృహలోకి వచ్చిన శరణ్య అమ్మా.. నాన్న.. అక్క ఏరంటూ అడగ్గా.. వారు చనిపోయారని వైద్యులు చెప్పారు. తన కుటుంబమంతా కళ్ల ముందే చనిపోవడంతో ఆ చిన్నారి షాక్‌కు గురైంది. ఈ లోకంలో తనకి ఇక ఎవరూ లేరంటూ.. అమ్మా.. నాన్నల దగ్గరికి వెళ్తానంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. చిన్నారి రోదనలు చూసిన ఆస్పత్రి సిబ్బంది కంటతడి పెట్టారు. వారి సమీప బంధువులకు సమాచారం అందించారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details