Cyber portal: బ్యాంకు అధికారుల్లా, కస్టమర్ కేర్ ప్రతినిధుల్లా మాట్లాడి మీతోనే మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఈ-వ్యాలెట్‌ల వివరాలు చెప్పించుకుని సైబర్ నేరస్థులు రూ.లక్షలు కాజేస్తున్నారు. వీరి దూకుడుకు కళ్లెం వేసేందుకు సైబర్‌క్రైమ్ పోలీస్ అధికారులు కొత్త పంథా అనుసరిస్తున్నారు. బాధితులు నిందితులకు బదిలీ చేసిన నగదు వివరాలను 24గంటల్లోపు టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసిన తర్వాత https://cybercime.gov.in పోర్టల్‌లో వివరాలను నమోదు చేస్తే వెంటనే బాధితుల ఖాతాల్లోకి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా నిర్విరామంగా నెట్‌వర్క్ పనిచేస్తోంది. దీంతోపాటు ఇక్కడ పట్టుపడిన నేరస్థుల వివరాలను ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడా నేరాలకు పాల్పడి ఉంటే హైదరాబాద్ నుంచి పీటీ వారెంట్ ద్వారా తీసుకెళ్లేందుకు సహకరిస్తున్నారు. దీంతో ఎక్కువకాలం వారు జైళ్లలో ఉండేలా చేస్తున్నారు. బీహార్, ఝార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో సైబర్ ముఠాలున్నాయి. వీరిని జైళ్లకు పంపడం ద్వారా అక్కడున్న ఇతర నేరస్థులకు భయం కలగడంతోపాటు తాత్కాలికంగా నేరాలు కాస్త తగ్గుతాయని భావిస్తున్నారు.
24 గంటల్లోపు ఫోన్ చేస్తే..సైబర్ నేరస్థుల బారిన పడిన బాధితులు 24 గంటల్లోపు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలి.