అటవీ ప్రాంతం నుంచి మేకల మందతో కలిసి వచ్చిన ఓ జింకను.. స్థానికులు కాపాడి అడవిలోకి వదిలారు. తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిందీ ఘటన. లింగాల మండల కేంద్రానికి చెందిన ఓ కాపరి మేకలను మేపడానికి.. స్థానిక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తిరుగుముఖం పట్టాడు. మేకలను కొట్టంలోనికి పంపుతుండగా వాటితో కలిసి వచ్చిన జింకను చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు.
వెంటనే.. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు.. రాత్రి జింకను పద్మన పల్లి బీట్ అడవిలో వదిలేశారు. వన్య ప్రాణులు అనుకోకుండా గ్రామాల్లోకి వస్తే ఎవరూ హాని తలపెట్టకుండా సమాచారం అందించాలని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రమేశ్ కోరారు. జింకను కాపాడిన స్థానికులను అభినందించారు.