SUICIDE ATTEMPT: హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం...ఎందుకంటే..!
14:32 October 04
SUICIDE ATTEMPT BY A COUPLE AT HIGH COURT
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ధూళిపాళ్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు చీలికోటి దేవేంద్రరావు, చీలికోటి భానుశ్రీల ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో కొందరు వ్యక్తులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఒంటిపై డీజిల్ పోసుకున్నారు. వారి ప్రయత్నాన్ని గమనించిన ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది.. దంపతులను వెంటనే అడ్డుకున్నారు. ఆ దంపతులు మాట్లాడుతూ..'1997 నుంచి మా స్థలంలో నివాసం ఉంటున్నాం. ప్రభుత్వం పట్టా కూడా ఇచ్చింది. ఆస్థలంలో 2017లో బస్‌షెల్టర్ నిర్మించేందుకు యత్నించగా అప్పట్లో హైకోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం మాకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చి. ఖాళీ చేయించొద్దని పేర్కొందని వివరించారు. కొందరు రాజకీయ నాయకులు హైకోర్టు ఉత్తర్వులు చెల్లవని, దిక్కున్న చోట చెప్పుకోవాలని, పది రోజుల్లో ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని వారు కన్నీరు పెట్టుకున్నారు. మేము చెప్పిందే న్యాయం, చట్టం అని వారు మాట్లాడుతున్నారు. మీ కుటుంబం ఒక్కటే ఎవడు వచ్చి కాపాడుతాడు అని హింస పెడుతున్నారు. దాంతో చచ్చిపోదామని వచ్చాం...'అని దేవేంద్రరావు, భానుశ్రీ పేర్కొన్నారు. ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం మేరకు తుళ్లూరు పోలీసులు హైకోర్టుకు చేరుకుని వారిని అమరావతిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించి ఠాణాకు తీసుకువచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ పోతురాజు చెప్పారు.
ఇదీ చదవండి: