AP Corona Cases: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,086 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 82 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 164 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,166 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లకూ విస్తరించింది. మధ్యప్రదేశ్ ఇందోర్‌లో ఒక్కరోజే 8 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. ఇందులో ఆరుగురు కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి ఇటీవల రాష్ట్రంలోకి 3 వేల మందికిపైగారాగా అందులో 26 మంది వైరస్ బారినపడినట్లు తెలిపారు.
Himachal Pradesh reports first Omicron caseహిమాచల్ ప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితమే మండీ జిల్లాలో ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధరించారు. కెనడా నుంచి వచ్చిన మహిళకు డిసెంబర్ 12నే వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ 24న మళ్లీ నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు.
Odisha reports four new omicron cases: ఒడిశాలో ఆదివారం మరో నలుగురికి ఒమిక్రాన్ సోకింది. వీరిలో ఇద్దరు నైజీరియా, మరో ఇద్దరు యూఏఈ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 8కి చేరింది.
3 నుంచి పిల్లలకు టీకా.. ప్రధాని మోదీ ప్రకటన
దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలిపారు. ఒమిక్రాన్ రకం వైరస్ విస్తృతి నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై 'ముందు జాగ్రత్త (ప్రికాషన్) డోసు' టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు.
ఏంటీ బూస్టర్ డోసు?
What is booster dose: వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా ఇచ్చే డోసునే బూస్టర్ డోసు అంటారు. మూడో డోసు వల్ల రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది. కరోనా వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటుంది. మూడో డోసు తీసుకుంటే కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఏఏ దేశాల్లో పంపిణీ చేస్తున్నారు?
అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో మూడో డోసు పంపిణీ ప్రారంభమైంది. జర్మనీ, ఆస్ట్రియా, కెనడా, అమెరికా వంటి దేశాలు మూడో డోసు అందిస్తున్నాయి. ఎక్కువ బూస్టర్ డోసులు అగ్రరాజ్యంలోనే పంపిణీ అయ్యాయి.