తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. ఆదివారం గ్రేటర్లో 800 మంది కొవిడ్ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌లో 94 కేసులు నమోదయ్యాయి. ఇటీవల అధికశాతం కొత్త ప్రాంతాల నుంచి పాజిటివ్ కేసులు కనిపిస్తుండడం కలవరపాటు కలిగిస్తోంది. భౌతిక దూరం విస్మరించడం, జనసమూహాల్లో యథేచ్ఛగా సంచరిస్తుండడం వల్ల వ్యాప్తి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు.
సిబ్బందిపై పనిభారం
వైరస్ ఉండి లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని అనుమానితులు అక్కడకు వెళ్తున్నారు. నగరం నలువైపుల నుంచి వచ్చిన 425 మందికి నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అత్యధికశాతం మందిలో వైరస్ లక్షణాలున్నట్టు వైద్యులు గుర్తించారు. రోజురోజుకు పరీక్షకు వస్తున్నవారి సంఖ్య పెరగడంతో సిబ్బందిపై పనిభారం పెరిగింది. వారి సంఖ్యను పెంచాల్సి ఉంది.
సవాల్ విసురుతూ..
క్షేత్రస్థాయిలో పోలీసు, వైద్య, జీహెచ్ఎంసీ యంత్రాంగం చర్యలు చేపడుతున్నా వైరస్ సవాల్ విసురుతోంది. ముషీరాబాద్ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి. సుల్తాన్‌బజార్ ఠాణాలో మరో నలుగురు కొవిడ్ బారినపడ్డారు. వీరిలో ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డు ఉన్నారు. వీరిని హోంక్వారంటైన్‌కు తరలించారు. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 23కు చేరింది. అంబర్పేట్ సర్కిలో ఒకేరోజు 23 మందికి పాజిటివ్‌గా తేలింది.