రాజధాని రైతుల ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగింది.. ప్రభుత్వ నిర్బంధాలను, కరోనా ఉద్ధృతులను తట్టుకుని సాగుతున్న అమరావతి ఉద్యమం మరో మైలురాయిని దాటింది. ఎత్తిన పిడికిలి దించకుండా రైతులు చేస్తున్న పోరాటం 800వ రోజుకు చేరింది. ప్రభుత్వ వైఖరిని తూర్పారబడుతూ అమరావతి ప్రజాదీక్ష మొదలైంది. 24 గంటల సామూహిక నిరశన దీక్షలకు వెలగపూడి వేదికయింది. గురువారం ఉదయం ప్రారంభమై.. శుక్రవారం ఉదయం వరకు కొనసాగే దీక్షలో రాజధాని ప్రాంత రైతు కూలీలు, మైనార్టీలు, దళిత, బీసీ, తదితర వర్గాలవారూ పాలుపంచుకున్నారు. లక్ష్యం చేరే వరకు ఇలాగే ముందుకెళతామని నినదించారు.
మహనీయుల స్ఫూర్తితో..
‘అమరావతి ప్రజా దీక్ష’ పేరుతో వెలగపూడిలో సామూహిక నిరాహార దీక్షలు గురువారం ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. సభావేదికకు ఓ వైపు ఆకుపచ్చని దుస్తులతో మహిళలు, మరోవైపు తెల్ల చొక్కాలు ధరించి పురుషులు దీక్షలో కూర్చున్నారు. అందరూ మెడలో ఆకుపచ్చ కండువాలు వేసుకున్నారు. ఉద్యమంలో అసువులు బాసిన వారికి, దీక్షాస్థలి వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగజ్జీవన్ రామ్, పొట్టి శ్రీరాములు చిత్రపటాల వద్ద నివాళులర్పించి దీక్షలను ప్రారంభించారు. అన్ని వర్గాలను ఉద్యమంలో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నందుకు చిహ్నంగా అంబేడ్కర్‌ను, 800 రోజులయినా బాపూజీ చూపిన శాంతి మార్గంలోనే ఉద్యమిస్తున్నందుకు గుర్తుగా గాంధీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీక్షలో దాదాపు 500 మందిపైగా పాల్గొన్నారు. ఐకాస నేతలు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభింపజేశారు. దీక్షలో ఉన్నవారికి మద్దతుగా రాజధానితో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
అండగా మేమున్నామని..
తెదేపా, భాజపా, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, తదితర పార్టీలు, వివిధ సంఘాల నేతలు సామూహిక దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు ప్రకటించారు. ఏకైక రాజధానిగా అమరావతికి అనుకూలమని ప్రకటించారు. తరతరాల వారసత్వంగా వచ్చిన భూములను రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం త్యాగం చేశారని కీర్తించారు. రెండేళ్లు దాటినా మడమ తిప్పకుండా ఉద్యమిస్తున్నారని, ఇందులో ముఖ్యంగా మహిళ పోరాటాన్ని, వారు చూపిస్తున్న తెగువను అభినందించారు. పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రభుత్వం మెడలు వంచేవరకు తామంతా మీ వెంటే ఉంటామని రైతులకు హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో తమ ప్రాంతాల్లోనూ ఉద్యమాలు చేపట్టి, పోరాట సెగ ప్రభుత్వానికి తగిలేలా చూస్తామని మాట ఇచ్చారు. హైకోర్టు న్యాయవాదులు శిబిరానికి వచ్చి మద్దతు పలికారు. న్యాయపోరాటంలో తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీక్షలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు కొద్దిసేపు కూర్చొని, వారికి మద్దతుగా నినాదాలు చేశారు.
*రాజధాని ఉద్యమంలో ఇంతవరకు భాజపా, సీపీఎం ఎప్పుడూ ఒకతాటిపైకి రాలేదు. గురువారం సమావేశంలో ఈ రెండు పార్టీలు వేదిక పంచుకోవడం విశేషం.
*మంత్రి బాలినేని అనుచరులు దాడి చేశారంటూ వార్తల్లోకెక్కిన ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బారావు గుప్తా వైకాపా కండువా కప్పుకుని రాజధాని ఉద్యమంలో పాల్గొనడం గమనార్హం. రాజధాని ఉద్యమంపై ఇప్పటి వరకు 45 గీతాలను విడుదల చేశారు. 800వ రోజు సందర్భంగా ఉద్యమ గీతాల గాయకుడు రమణ రచించి, ఆలపించిన ‘800 రోజులుగా పోరాటం చేస్తున్న రైతుల్లారా.. అలుపెరగని తల్లుల్లారా..’ అంటూ సాగే ప్రత్యేక పాటను తెదేపా నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విడుదల చేశారు.
*దీక్షావేదికపై సీపీఎం నేత మధు మాట్లాడుతూ.. తాడేపల్లి చౌరస్తా బంద్ చేద్దామని పిలుపునిచ్చారు. దీనికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తాము తెదేపా, భాజపాలతో కలవబోమని చెబుతుండగా.. కింద ఉన్న భాజపా నాయకులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. ‘జై శ్రీరాం’ ‘భారత్ మాతాకీ జై’, ‘మోదీ నాయకత్వం వర్థిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అమరావతి రాజధాని ఐకాస నేతలు కలగజేసుకుని సర్దిచెప్పారు.
ఏకైక శ్మశానం అన్న భూములే.. అప్పులకు పనికొచ్చాయా?
రాజధాని అమరావతి ప్రాంతాన్ని శ్మశానం అన్నవాళ్లే... ఇప్పుడు అక్కడి భూములు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు చేస్తున్న ఉద్యమం 800వ రోజుకి చేరిన సందర్భంగా గురువారం చంద్రబాబు వారికి అభినందనలు తెలియజేశారు. వారి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వారి ఉద్యమానికి, పోరాటానికి తెదేపా ఎప్పుడూ సంపూర్ణ మద్దతిస్తుందని తెలిపారు. ‘ప్రత్యేకంగా ఒక ప్రాంతంపై కక్ష పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం. రాష్ట్రంలో లక్షల కోట్ల సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని తన మూర్ఖపు వైఖరితో నిలిపివేసిన జగన్‌ను, ఆయన చేసిన తప్పుల్ని చరిత్ర ఎన్నటికీ క్షమించదు’ అని గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతికి రాష్ట్ర ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేశారు. అమరావతి ప్రజాదీక్షకు వివిధ పార్టీల నేతలు మద్దతు తెలిపి మాట్లాడారు.