జిల్లా కేంద్రాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా, పాలనను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని 13 రెవెన్యూ జిల్లాలను 26గా విభజించారు. అదే సమయంలో న్యాయం కూడా వారికి చేరువ కావాలి. అదనపు జిల్లా కోర్టులు, మున్సిఫ్, మేజిస్ట్రేట్ కోర్టుల కంటే.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) కోర్టు ఉంటే సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుంది. పెండింగు కేసుల భారం కొంతయినా తగ్గుతుంది. న్యాయ సౌలభ్యం కలిగి ఉండటం పౌరుల ప్రాథమిక హక్కు అనే విషయాన్ని రాజ్యాంగంలోని 14, 21 అధికరణలు చెబుతున్నాయి. న్యాయ జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే.. దానిపై హైకోర్టు న్యాయమూర్తుల (ఫుల్ కోర్టు) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
ప్రయోజనాలెన్నో
న్యాయ జిల్లాలను ఏర్పాటుచేస్తే ప్రజలకు.. ముఖ్యంగా కక్షిదారులకు న్యాయస్థానాలు చేరువలో ఉంటాయి. దూరంగా ఉండే ఉమ్మడి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, దగ్గరలో జిల్లా కోర్టుకు వెళ్లగలిగితే.. సత్వర న్యాయం పొందే అవకాశం ప్రజలకు దక్కుతుంది. కేసుల విభజన జరిగి, పనిభారం తగ్గడం వల్ల విచారణలూ త్వరగా పూర్తవుతాయి. మహిళా కోర్టులు, ఎస్సీ, ఎస్టీ కోర్టులు, పోక్సో కేసుల విచారణ కోర్టులు.. ఇవన్నీ జిల్లా పరిధిలోకి రావడంతో న్యాయసేవలు దగ్గరవుతాయి. కొత్త జిల్లా కేంద్రాల్లో కొన్నిచోట్ల ఉన్న అదనపు జిల్లా కోర్టులను పీడీజే కోర్టులుగా డిజిగ్నేట్ చేయడం పెద్ద కష్టం కాదన్నది న్యాయవర్గాల అభిప్రాయం.
ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచే రావాలి:జ్యుడిషియల్ జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం/ న్యాయశాఖ కార్యదర్శి నుంచే హైకోర్టుకు రావాలి. నిధుల కేటాయింపు, పోస్టుల మంజూరు, భవనాలు, మౌలిక సదుపాయాల వివరాలన్నీ పంపాలి. హైకోర్టులో జరిగే ఫుల్‌కోర్టు సమావేశంలో వీటిపై చర్చించి, ప్రతిపాదనలకు మార్పులు.. చేర్పులు చేయవచ్చు. దీనికి హైకోర్టు ఆమోదం తెలిపాక కేసుల విచారణ పరిధులను నిర్ణయించి, పోస్టులను నోటిఫై చేస్తుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేస్తుంది. అప్పుడు రాష్ట్రప్రభుత్వం జ్యుడిషియల్ జిల్లాలకు గెజిట్ ప్రకటన జారీచేస్తుంది. ఈ వివరాలను హైకోర్టుకు పంపే ప్రక్రియలో న్యాయశాఖ ఉన్నట్లు సమాచారం.
న్యాయస్థానాలపై కేసుల భారం:పేరుకుపోతున్న కేసులు, తగ్గిపోతున్న సిబ్బంది, న్యాయమూర్తుల కొరతతో న్యాయస్థానాలపై కేసుల భారం పెరుగుతోంది. జడ్జిల సంఖ్య తక్కువగా ఉండటం, సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి కోర్టులను పట్టిపీడిస్తున్నాయి. కొన్ని కోర్టుల్లో కేసుల వాయిదాలకే సమయం సరిపోతుంది. ఒక్కో కోర్టులో 500- 600 కేసులే ఉండాల్సినది.. ఏకంగా 2,500 నుంచి 3వేల కేసులు పెండింగులో ఉన్నాయి. వివిధ కారణాలతో కేసులు వాయిదా పడుతూ విచారణ ఏళ్లతరబడి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దిగువ కోర్టుల్లో 8,08,621 కేసులున్నాయి. ఇందులో 4,18,157 సివిల్ కేసులు కాగా, 3,90,464 క్రిమినల్ కేసులు.