ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Contempt of Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కానీ - IAS officers jail for contempt of court

contempt of court
contempt of court

By

Published : Mar 31, 2022, 12:04 PM IST

Updated : Apr 1, 2022, 5:46 AM IST

12:01 March 31

రెండు వారాలపాటు జైలు శిక్ష విధించిన హైకోర్టు

కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష..

High Court:

న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన 8 మంది ఐఏఎస్‌ అధికారులపై హైకోర్టు కన్నెర్ర చేసింది. సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో వీరికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ శిక్ష పడినవారిలో గోపాల కృష్ణ ద్వివేది (పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి), ఎం.గిరిజాశంకర్‌ (పౌరసరఫరాలశాఖ కమిషనర్‌, పంచాయతీరాజ్‌శాఖ పూర్వ కమిషనర్‌), బి.రాజశేఖర్‌ (పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), వాడ్రేవు చిన వీరభద్రుడు (గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌, పాఠశాల విద్య పూర్వ కమిషనర్‌), జె.శ్యామలరావు (ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పురపాలకశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి), వై.శ్రీలక్ష్మి (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ, పూర్వ ముఖ్య కార్యదర్శి), జి.విజయకుమార్‌ (ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి, పురపాలకశాఖ పూర్వ డైరెక్టర్‌), ఎం.ఎం నాయక్‌ (పురపాలకశాఖ కమిషనర్‌, పురపాలకశాఖ పూర్వ డైరెక్టర్‌) ఉన్నారు. శిక్ష విధింపుపై కోర్టుకు ఏమైనా చెప్పదలచుకున్నారా? అని న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అడిగిన ప్రశ్నకు ఐఏఎస్‌లు ఒకరి తర్వాత ఒకరుగా క్షమాపణలు కోరారు. ఆదేశాల అమలులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకూ అందించిన సేవలు, వయసును దృష్టిలో పెట్టుకొని క్షమించాలని కోరారు. ఆ క్షమాపణలను మానవతా దృక్పథంతో న్యాయస్థానం అంగీకరించాలంటే.. సామాజిక సేవ చేసేందుకు సిద్ధమేనా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు వారు అంగీకారం తెలపడంతో.. ఏడాదిపాటు నెలకోసారి ఏదో ఒక ఆదివారం సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో కొంత సమయం గడపాలని ఐఏఎస్‌లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. విద్యార్థులకు ఆ పూట భోజనం ఖర్చులను సొంతంగా భరించాలని ఆదేశించారు. ఏయే జిల్లాలకు ఎవరెవరు వెళ్లాలో న్యాయమూర్తే తెలిపారు. ప్రతి నెలా వసతి గృహాలను సందర్శించిన వివరాలు, ఫొటోలను హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌కు పంపాలని స్పష్టంచేశారు. ఇలా చేయడంలో విఫలమైతే వారిపై కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టు రిజిస్ట్రీ తిరిగి తెరిచేందుకు వెసులుబాటు ఇచ్చారు. అధికారులకు జైలుశిక్షను నిలుపుదల చేస్తూ.. సామాజిక సేవా శిక్షను విధించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఈ మేరకు తీర్పు వెల్లడించారు.

చట్ట ప్రకారం పని చేయడం అధికారుల బాధ్యత. కోర్టు ఆదేశాలను అధికారులు ఉల్లంఘించడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. సీనియర్‌ ఐఏఎస్‌ల నుంచి ఈ తరహా అలసత్వం, చట్టం పట్ల అగౌరవ శైలిని న్యాయస్థానం ఊహించలేదు.- హైకోర్టు

ఏడాది పాటు కన్నెత్తి చూడలేదు:ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు జరగకుండా చూడాలని న్యాయస్థానం ఆదేశించినా ఏడాదిపాటు ఆ ఉత్తర్వులవైపు అధికారులు కన్నెత్తి చూడలేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సచివాలయాలు, ఇతర నిర్మాణాలను పూర్తిగా నిలిపేశామని అధికారులు కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసినా.. ఇంకా నిర్మాణాలు చేపడుతున్నారని తాజాగా వ్యాజ్యాలు దాఖలవుతున్నాయని గుర్తుచేశారు. పాఠశాలల విషయంలో ఐఏఎస్‌లు వ్యవహరించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమని వ్యాఖ్యానించారు.

నేపథ్యమిదే:ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, నిర్మాణాలు సరికాదని, వాటిని తొలగించాలని 2020 జూన్‌ 11న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.ఏడాదికి పైగా ఆ ఉత్తర్వులను అధికారులు పట్టించుకోలేదు. దీంతో 2021 జులై 12న అప్పటి పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ, పాఠశాల విద్యాశాఖకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌లపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదుచేసింది. తర్వాత కాలంలో ఆ శాఖల బాధ్యతలను నిర్వహించిన ఐఏఎస్‌లను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో మొత్తం 8 మంది ఐఏఎస్‌లపై సుమోటో కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. గురువారం తీర్పును వెల్లడించింది.

సీనియర్‌ ఐఏఎస్‌ల నుంచి ఈ తరహా శైలిని ఊహించలేదు: ‘అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలిస్తే 1,371 పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతోంది. సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు తెరిచేవరకూ వాటి తొలగింపునకు, మధ్యంతర ఉత్తర్వుల అమలుకు అధికారులు చర్యలు చేపట్టలేదు. 2021 సెప్టెంబరులో పాఠశాలల నుంచి సచివాలయాలు, భరోసా కేంద్రాలను ఖాళీ చేయించారు. పేద, మధ్యతరగతి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారన్నది అందరికీ తెలిసిన విషయమే. సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేవరకూ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టే పేదల విషయంలో వారి తీరు అర్థమవుతోంది. చట్ట ప్రకారం పని చేయడం అధికారుల బాధ్యత. కోర్టు ఆదేశాలను అధికారులు ఉల్లంఘించడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. సీనియర్‌ ఐఏఎస్‌ల నుంచి ఈ తరహా అలసత్వం, చట్టం పట్ల అగౌరవ శైలిని న్యాయస్థానం ఊహించలేదు. ఇది దురదృష్టకరం. కోర్టు ఆదేశాలను సరైన స్ఫూర్తితో అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:"కోర్టు ధిక్కరణకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తాం... అస్సలు ఉపేక్షించం"

Last Updated : Apr 1, 2022, 5:46 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details