ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పుల ఊబిలో కూరుకుపోతోన్న రాష్ట్రం... రుణ భారం 7.76 లక్షల కోట్లు?

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం..... రాష్ట్ర రుణభారం రూ.7.76 లక్షల కోట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయడంతోనే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు

ap
ap

By

Published : Mar 29, 2022, 5:05 AM IST

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం పెండింగ్‌ బిల్లులతో కలిపి రాష్ట్ర రుణభారం రూ.7.76 లక్షల కోట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు, ఈ ఏడాది ఎలా గడవాలన్న కోణంలోనే ప్రభుత్వాలు ఆలోచిస్తుండటంతో ఆర్థిక పరిస్థితులు గతి తప్పుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పరిమితికి మించి అప్పులు చేస్తోందని, వాటిని తీర్చేందుకు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలంటూ కాగ్‌ ఇప్పటికే సూచించింది. అప్పు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేసే పరిస్థితులు ఏర్పడటం ప్రమాదకరమంటూ హెచ్చరించింది. ఆదాయ పరిధికి లోబడి రుణాలు సేకరిస్తే, అది శ్రేయస్కరమని ప్రపంచబ్యాంకు సూచిస్తోంది. రాష్ట్ర జీఎస్‌డీపీలో ఏటా రుణాలు 4 శాతానికి మించకూడదని ఆర్థిక సంఘం చెబుతోంది. ఈ ఆర్థిక సూత్రాలను తోసిరాజని రాష్ట్రం అప్పుల వేటలో కొనసాగడం ఆర్థికవేత్తలను విస్మయ పరుస్తోంది.

పరిమితులంటే లెక్కలేదు
రాష్ట్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో ప్రజాపద్దు, బహిరంగ మార్కెట్‌ రుణం కలిపి రూ.67,723 కోట్ల అప్పు చేసినట్లు నిపుణులు లెక్కకట్టారు. ఇందులో కార్పొరేషన్ల రుణాలను పరిగణించలేదు. తుది లెక్కలు తేలేసరికి ఇది ఇంకా
పెరగనుంది.
కేంద్ర వ్యయ నియంత్రణ విభాగం 2021-22 ప్రారంభంలో రాష్ట్ర జీఎస్‌డీపీ అంచనాల మేరకు నిర్దేశించిన పరిమితి దాటిపోయిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది బహిరంగ రుణం పరిమితికి మించి రూ.14,086 కోట్లు తీసుకున్నట్లు అంచనా. 2015-16 నుంచి ఇప్పటివరకు ఇలా రూ.51,930.83 కోట్లు సమీకరించినట్లు నిపుణులు లెక్కించారు. 2015-16 నుంచి 2018-19 వరకు పరిమితికి మించి చేసిన అప్పు రూ.18,455.27 కోట్లు కాగా, గత మూడేళ్లలో అది దాదాపు రెట్టింపైంది. 2019-20 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల మధ్య పరిమితికి మించి రూ.33,475.56 కోట్లు సేకరించారు. ఇవి కాకుండా కార్పొరేషన్ల రుణాలు, పెండింగ్‌ బిల్లులు కూడా రాష్ట్రంపై రుణభారంగానే లెక్కించాలని నిపుణులు పేర్కొంటున్నారు.

పరిమితిని ఎలా నిర్దేశిస్తారంటే?
ఏటా జీఎస్‌డీపీలో 4శాతానికి రుణాలు పరిమితం చేయాలని ఆర్థిక సంఘం సూచించింది. దీన్ని బట్టి జీఎస్‌డీపీ అంచనాల ఆధారంగా రాష్ట్ర రుణ పరిమితిని కేంద్రం లెక్కించి అనుమతిస్తుంది. విదేశీ, నెగోషియేటెడ్‌ రుణాలు, పీఎఫ్‌, ఇతర ప్రజాపద్దు రూపంలో పొందే మొత్తం ఈ పరిమితి నుంచి మినహాయించారు. పాత అప్పుల చెల్లింపుల మొత్తాన్ని దీనికి కలిపి స్థూల రుణ పరిమితిగా లెక్కించారు. అందులో నుంచి అంతకుముందు సంవత్సరాల్లో అదనంగా చేసిన అప్పుల మొత్తాన్ని తగ్గించి నికర రుణ పరిమితిని తేల్చారు. అందులోనూ 0.5శాతం మూలధన వ్యయంతో అనుసంధానించి కోత పెడుతున్నారు. నిర్దిష్ట పరిమితి మేరకు మూలధన వ్యయం చేస్తేనే ఆ 0.5శాతం రుణం పొందేందుకు అర్హత కల్పిస్తారు. మరో 0.5శాతాన్ని విద్యుత్తు సంస్కరణల అమలు తదితరాలతో ముడిపెడుతున్నారు. 2021-22లో ఇలాంటి అనేక నిబంధనలు పెట్టి రుణ పరిమితిని తగ్గించినా వాస్తవంలో అప్పులు భారీగానే పెరిగాయి. కొన్నింటిలో అంచనాలు తక్కువ చూపి రుణ అర్హత పెంచుకోవడం, జీఎస్‌డీపీ అంచనాలు ఎక్కువ చూపడం వల్ల పరిమితికి మించి రుణాలు తీసుకునే సౌలభ్యాన్ని సృష్టించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికితోడు విదేశీ రుణాలు, పీఎఫ్‌, డిపాజిట్లు, ఇతర నిల్వల రూపంలో వినియోగించే నిధులు, నాబార్డు సాయాన్ని తక్కువగా చూపుతున్నట్లు చెబుతున్నారు. అంచనాలు, వాస్తవాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది.

* 2021-22 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌, ఇతర ప్రజాపద్దు రూపంలో కేవలం రూ.1,500.21 కోట్లు మాత్రమే రుణం తీసుకోవచ్చని తొలుత ప్రభుత్వం అంచనా వేసింది. కాగ్‌ వెలువరించే నెలవారీ నివేదికలు పరిశీలిస్తే సవరించిన లెక్కలకు, అంచనాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. తాజా లెక్కల ప్రకారం ప్రజాపద్దు రూపంలో వినియోగించుకున్నది రూ.12 వేల కోట్లు ఉంది. విదేశీ ఆర్థిక సంస్థల రుణాలను రూ.2,000 కోట్లుగా అంచనా వేసి, చివరకు రూ.3,976 కోట్లు తీసుకున్నారు.
* 2020-21లో పీఎఫ్‌, ప్రజాపద్దు నికర మొత్తం రూ.1972.84 కోట్లుగా అంచనా వేశారు. సవరించిన అంచనాల ప్రకారం ఆ మొత్తం రూ.10,916.77 కోట్లకు చేరింది. విదేశీ రుణాల అంచనా రూ.1,756.66 కోట్లు కాగా, వాస్తవ లెక్కల్లో రూ.4,562.74 కోట్లుగా తేలింది.

చెల్లింపుల గడువులోనూ వెసులుబాటు
గతంలో బహిరంగ మార్కెట్‌ రుణాలను ఐదేళ్లలోపు చెల్లించాల్సి ఉండేదని, ఒక ప్రభుత్వం చేసిన అప్పును తదుపరి ప్రభుత్వ హయాంలో తీర్చేవారని ఆర్థికశాఖ విశ్రాంత అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట ఈ గడువులో వెసులుబాటు కల్పించడంతో అప్పుల భారం పెరిగిపోతోందని విశ్లేషిస్తున్నారు. ఇటీవల 20 ఏళ్ల కాలపరిమితితోనూ బహిరంగ మార్కెట్‌లో రుణసమీకరణ చేస్తున్నారు
ఇవి కాకుండా మూడేళ్లుగా సరఫరాదారులకు, గుత్తేదారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతరత్రా బకాయిలు రూ.1,50,000 కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా. సీఎఫ్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారమే ఇవి రూ.60 వేల కోట్లకు మించిపోయాయి. ఈ రూపేణా రాష్ట్రంపై మొత్తం రుణ భారం రూ.7.76 లక్షల కోట్లకు చేరుతోందని అంచనా. జీఎస్‌డీపీలో రుణభారం వాటా పెరిగిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

నేడు చివరి విడత రుణం
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి విడతగా మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలోరూ.943 కోట్ల మేర రుణ సమీకరణకు ప్రతిపాదనలు పంపింది. 20 ఏళ్ల కాలపరిమితితో ఈ మొత్తం తీసుకునేందుకు సెక్యూరిటీల వేలంలో పాల్గొంటోంది. వడ్డీరేటు ఎంతన్నది మంగళవారం ఖరారవుతుంది.

ఇదీ చదవండి :CM Jagan: మంచి వ్యక్తి, స్నేహితుడిని కోల్పోయా.. గౌతంరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details