విధి ఆయన్ని వికలాంగుడిని చేసింది. కష్టాలు చుట్టాల్లా చుట్టుముట్టాయి. అయితేనేమి సంకల్పం ముందు వైకల్యం తలవంచింది. 40 ఏళ్ల వయస్సులో కాలు కోల్పోయినా... ఆరు పదుల వయసులో జీవితాన్ని ఆత్మస్థైర్యంతో నెట్టుకొస్తున్నాడు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగంపల్లికి హనుమాండ్ల కొమురయ్య.
గ్రామానికి చెందిన హనుమాండ్ల కొమురయ్యకు 20 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు కుడికాలు కోల్పోయాడు. నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్న కొమరయ్యది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా... కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదురైనా... కష్టాలకు ఎదురీదుతూ పిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. వృద్ధాప్యంలోను ఒంటికాలితోనే సైకిల్ తొక్కుకుంటూ ఉపాధిహామీ పనులు చేస్తున్నాడు.