రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 149కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో తొలి మరణం గురువారం నమోదైంది. సోమవారం రాత్రి 10 గంటల వరకు 43 కేసులే నమోదవగా, ఆ తర్వాత మూడు రోజుల్లో అదనంగా 106 కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 10 నుంచి గురువారం ఉదయం 10 గంటల మధ్య నిర్వహించిన పరీక్షల్లో 21, గురువారం సాయంత్రం మరో 11 కేసులు వచ్చాయి. సాయంత్రం 6 గంటల తర్వాత మరో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 కేసులు, తర్వాత కృష్ణాలో 23, గుంటూరు జిల్లాలో 20 కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసూ నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనాతో తొలి మరణం నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించగా.. అది తాము పంపించిన సమాచారమేనన్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విజయవాడకు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని, అతని తండ్రి చనిపోయారని చెప్పారు. మరణానంతరం పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అని తేలిందని వెల్లడించారు.
గురువారం పరిణామాలు ఇలా..
- ఉదయం 10 వరకు నమోదైన 132 కరోనా పాజిటివ్ కేసుల్లో... 91 మంది దిల్లీలోని తబ్లీగీ జమాత్ సమావేశానికి హాజరైనవారు కాగా, 20 మంది వారికి సన్నిహితంగా మెలిగినవారు.
- 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 123 నమూనాలు పరీక్షించగా, 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగతా 112 నమూనాలు నెగెటివ్‌గా తేలాయి.
- సాయంత్రం 6 గంటల తర్వాత 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.