ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

5G Technology: '5జీ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు.. కీలక రంగాలన్నిటిపైనా ప్రభావం' - 5జీ టెక్నాలజీతో మార్పులు

5G Technology Revolution: 5జీ టెక్నాలజీతో జీవన విధానంలో విప్లవాత్మక మార్పులతో.. కీలక రంగాలన్నిటిపైనా ప్రభావం చూపిస్తుందని టెలికమ్యూనికేషన్ నిపుణురాలు కల్యాణి బోగినేని తెలిపారు. కొత్త టెక్నాలజీలతో నాలుగో పారిశ్రామిక విప్లవం వస్తుందని.. కర్మాగారాల స్వరూపం మారిపోయి రోబోల వినియోగం పెరుగుతుందని వెల్లడించారు. త్వరలోనే రోబోటిక్స్‌, సెన్సర్లతో వ్యవసాయం మరింత కొత్తపుంతలు తొక్కనుందని పేర్కొన్నారు.

5G Technology
5G Technology

By

Published : Jan 19, 2022, 11:28 AM IST

5G Technology Revolution: ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ప్రజల దైనందిన జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని టెలికమ్యూనికేషన్‌ నిపుణురాలు కల్యాణి బోగినేని తెలిపారు. అరచేతిలోనే సమస్త ప్రపంచం ఉంటుందని, భవిష్యత్తు టెక్నాలజీలైన కృత్రిమమేధ, డేటా అనలటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ విద్య, వైద్యం, వ్యవసాయంలో కీలకం కానున్నాయని పేర్కొన్నారు. 5జీతో అత్యధిక వేగంతో ఇంటర్నెట్‌, పౌరసేవలు విస్తృతంగా అందించేందుకు వీలవుతుందన్నారు. నెట్‌వర్క్‌ లేని గ్రామాల్లో వైర్‌లెస్‌ బ్లాక్‌హోల్‌ టెక్నాలజీతో అంతరాయం లేకుండా ఆన్‌లైన్‌ విద్యను అందించవచ్చన్నారు. గత 3 దశాబ్దాలుగా అమెరికాలో పరిశోధన రంగంలో ఉన్న కల్యాణి వెరైజెన్‌ టెక్నాలజీ సంస్థలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తూ 5జీ టెక్నాలజీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడకు చెందిన ఈమె 1977లో తిరుపతిలోని ఎస్‌వీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు.

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌ఇ)లో పీజీ, తర్వాత అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ బఫ్లోలో పీహెచ్‌డీ చేశారు. అక్కడే టెక్నాలజీ రంగంలో విస్తృతంగా పరిశోధన చేసిన ఈమె 70కి పైగా పేటెంట్లు పొందడంతోపాటు 35 ప్రచురణలు చేశారు. తన తండ్రి ఐఐటి ఖరగ్‌పుర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారని, అప్పటి నుంచే తనకు ఇంజినీరింగ్‌పై ఆసక్తి కలిగిందన్న కల్యాణి 2021వ సంవత్సరానికి వెరైజన్‌ మాస్టర్‌ ఇన్వెంటర్‌ అవార్డును అందుకున్నారు. రానున్న కాలంలో 5జీ టెక్నాలజీ కీలకంగా మారనున్న నేపథ్యంలో పలు విషయాలు వెల్లడించారు.

కొత్త టెక్నాజీలతో యాంత్రీకరణ, ఉద్యోగాలపై ప్రభావం ఎలా ఉంటుంది?

కొత్త టెక్నాలజీలతో నాలుగో పారిశ్రామిక విప్లవం వస్తుంది. కర్మాగారాల స్వరూపం మారిపోతుంది. రోబోల వినియోగం పెరుగుతుంది. మనుషులు చేసే పనుల్లో అనేకం రోబోలు చేస్తాయి. వ్యవసాయంలోనూ కృత్రిమ మేధ, ఐవోటీ వినియోగం పెరుగుతోంది. పంటలకు ఎప్పుడు నీరు పెట్టాలి.. ఎప్పుడు మందులు చల్లాలి.. ఇవన్నీ మొదలయ్యాయి. త్వరలోనే రోబోటిక్స్‌, సెన్సర్లతో వ్యవసాయం మరింత కొత్తపుంతలు తొక్కనుంది. ఈ పరిజ్ఞానమంతా ఆర్థిక పురోగతితోపాటు కొత్త ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుంది.

భారత్‌లో 5జీ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది?

భారత్‌లో 5జీ స్పెక్ట్రమ్‌ అందుబాటులో ఉండాలి. ఈ స్పెక్ట్రమ్‌ను టెలికం కంపెనీలు కొనుగోలు చేసి, వాటిపై సేవలను అందిస్తాయి. ఆ మేరకు 5జీ టవర్లు పెట్టాలి. డేటా సెంటర్లలో అప్‌గ్రేడ్‌ చేయాలి. ఫోన్లలో చిప్‌సెట్‌లు, యాప్‌లు 5జీకి మారాలి. మొబిలిటీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి చాలా సమయం పడుతుంది. ఏ టెక్నాలజీ అయినా, ప్రారంభమైన తరువాత పూర్తిస్థాయి వినియోగ స్థాయికి చేరేందుకు కనీసం పదేళ్ల సమయం పడుతుంది.

ఆధునిక సాంకేతికత ఫలాలు అందరికీ చేరువయ్యేదెలా?

ప్రజలందరికీ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. మెసేజ్‌, వీడియో, ఆడియో వాయిస్‌లతో పాటు నిర్మాణ, ఆరోగ్య, రవాణా, ఆర్థిక, విద్య సంబంధిత అప్లికేషన్లపై వారికి అవగాహన కల్పించాలి. వాట్సప్‌ సామాన్య ప్రజలు కూడా తేలిగ్గా ఉపయోగించుకునేలా ఉంది. అదేస్థాయిలో డెవలపర్లు మిగతా రంగాల యాప్‌లను అభివృద్ధి చేయాలి. విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆన్‌లైన్లో ఎన్నో కోర్సులు వస్తున్నాయి. వాటిని త్వరగా నేర్చుకోవచ్చు. చాలా మంది ఉద్యోగంలో చేరాక, కొత్త టెక్నాలజీలపై దృష్టి పెట్టడం లేదు. ఇలా చేస్తే ఉద్యోగంలో ముందుకెళ్లలేం. సెల్‌ఫోన్‌, యాప్‌లు పూర్తిస్థాయిలో వాడగలిగేవారెవరికైనా భవిష్యత్తులో అన్ని పనులూ సులభమవుతాయి. విద్య, వైద్యం సహా దైనందిన అవసరాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది.

ఈ సాంకేతికతతో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి?

ర్థిక, సామాజిక రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. టెలికాం రంగం గత 30 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. 2జీ వైర్‌లైన్‌, వైర్‌లెస్‌ వాయిస్‌తో మొదలై, 3జీలో ఆన్‌ డిమాండ్‌ ఇంటర్నెట్‌గా మారి.. 4జీతో నిరంతరం ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వేగవంతమైన బ్యాండ్‌విడ్త్‌ అవసరం. ఈ సమస్యను 5జీ తీర్చుతుంది. దీంతో వర్చువల్‌, ఆగ్‌మెంటెడ్‌ రియాల్టీ పరిజ్ఞానాలు విస్తృతం కానున్నాయి. ఇప్పటికే గేమ్‌లతో పాటు కొన్ని యాప్‌లు వచ్చాయి. ఉదాహరణకు ఒక గేమ్‌ ఆడుతున్నపుడు మనం ఆ ప్రదేశాలకు స్వయంగా వెళ్లిన అనుభూతి కలుగుతుంది. పర్యాటక, చారిత్రక ప్రదేశాలు, అడవిలో వన్యప్రాణుల వంటి దృశ్యాలు కూడా స్వయంగా పక్కనే ఉండి చూస్తున్నట్లు ఉంటుంది. దీని కోసం గ్లాస్‌లు, ఇతర తెరలు అవసరమవుతాయి. మొబైల్‌ బ్రాడ్‌బాండ్‌ సామర్థ్యంతో పాటు ఎక్కువ సామర్థ్యం గల డేటాను సులభంగా, వేగంగా పంపడం, డౌన్‌లోడ్‌ చేసుకోవడం సహా అనేక ప్రయోజనాలున్నాయి.

భవిష్యత్తు టెక్నాలజీలతో అనుసంధానం వల్ల ఎలాంటి సేవలు పొందవచ్చు?

ప్రస్తుతం భవిష్యత్తు టెక్నాలజీలైన కృత్రిమమేధ, డేటా అనలిటిక్స్‌, రోబోటిక్స్‌ కీలకం. ఇవి అన్ని రంగాల్లో ప్రభావం చూపనున్నాయి. ఉదాహరణకు ఏదైనా ఒక ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య ఎదురైనప్పుడు వేగంగా పరిష్కార మార్గాలను ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపించవచ్చు. ఇంట్లోని ఏసీ, టీవీ ఇతర వస్తువులను మొబైల్‌ ఫోన్‌తో నియంత్రించవచ్చు. తాగునీరు, డ్రైనేజీ పైపులకు సెన్సర్లు అనుసంధానం చేసి, ఎక్కడ సమస్య ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం, తక్షణ సాయం, రక్షణ, నష్టాల అంచనా వంటి చర్యలకు చాలా ఉపయోగపడుతుంది. సెల్‌టవర్లలో సాంకేతిక సమస్యల్ని రోబోలు, డ్రోన్‌లతో పరిష్కరించవచ్చు. ఆన్‌లైన్‌ విద్యావిధానం మరింతగా మారిపోతుంది. గతంలో ఆసుపత్రికి వెళ్లి నిరీక్షించేవాళ్లం. ఇప్పుడు యాప్‌లో సమస్యలను నమోదు చేస్తే అవసరమైన వైద్యులు ఆన్‌లైన్లోకి వచ్చి సేవలు అందిస్తారు. 5జీతో 4జీ కంటే చాలా రెట్లు ఎక్కువగా, వేగంగా సమాచారం పొందవచ్చు.

ఇదీ చూడండి:జియోకు భారీగా పెరిగిన కొత్త యూజర్లు

ABOUT THE AUTHOR

...view details