Banjarahills Land Issue: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో నిత్యం ఏదో ఒక స్థలవివాదం వెలుగులోకి వస్తోంది. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వద్ద... సర్వే నంబర్ 403లోని 2248గజాల భూవివాదం సంచలనం రేపింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వద్ద సర్వే నంబర్ 403లోని 2248 గజాల భూమిలో ఆదివారం సుమారు 80 మంది వ్యక్తులు అక్కడికి వచ్చి భద్రతా సిబ్బందిపై దాడి చేసి భూమిలో సామగ్రి దించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది పరారీలో ఉన్నారు.
ప్రధాన నిందితులుగా... టీజీ విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ, సుభాష్ పులిషెట్టి, మిథున్ కుమార్ అల్లులను చేర్చారు. మరో 75 నుంచి 80 మంది ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్ పేర్కొన్నారు. అయితే వైద్య పరీక్షల కోసం వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో సుభాష్, మిథున్ కలిసి తప్పించుకున్నారు. మిగిలిన 58 మందిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు. పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు.
'ఆ భూమిపై మాకు అధికారం ఉంది. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నేను దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశాను. బంజారాహిల్స్ భూమిని 25 శాతం కొనుగోలు చేశాం. మిగతా 75 శాతం డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏ సర్బన్ అనే కంపెనీ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తోంది. కోర్టుకు వెళ్తే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. మా స్థలంలో ఓ కార్యక్రమం నిమిత్తం వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద ఎలాంటి మారణాయుధాలు లేవు.'- విశ్వ ప్రసాద్, ఏ-1 నిందితుడు