రోగి తనకు కడుపులో తీవ్రమైన నొప్పి ఉందని, అది ముందునుంచి వెనక్కి వ్యాపిస్తోందని ఆసుపత్రికి వచ్చారు. ముఖ్యంగా మూత్రవిసర్జన సమయంలో నొప్పి మరింత ఎక్కువ ఉంటోందన్నారు. దాంతోపాటు ఆ సమయంలో వికారం, వాంతులు, తలతిరగడం లాంటి సమస్యలూ కనిపించాయి. ఇవన్నీ మూత్రపిండాలకు సంబంధించిన సమస్య లక్షణాలే అనుకున్నారు. దాంతో స్థానిక వైద్యులు తొలుత ఆమెకు నొప్పి తగ్గడానికి, వాంతులు తగ్గడానికి చికిత్స చేశారు తప్ప, అసలు కారణం ఏంటన్నది పరీక్షించలేదు. తీరా చూస్తే... 55 రాళ్లు ఆమె ముత్రపిండాల్లో ఉన్నాయి. ఒకవేళ అలాగే చికిత్స చేయకుండా వదిలేస్తే మూత్రనాళం మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు పెరిగి... మూత్రపిండాల మీద అదనపు భారం పడి, కాలక్రమంలో అవి పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది.
'రోగికి మూత్రపిండాల్లో రాళ్ల వల్ల తీవ్రమైన నొప్పి రావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. రెనోగ్రఫీ, సీటీ స్కాన్ ద్వారా పరిస్థితి అంచనా వేసినప్పుడు ఎడమవైపు మూత్రపిండంలో పొత్తికడుపు, మూత్రనాళాల మధ్య ప్రాంతంలో మధ్యస్థాయి నుంచి తీవ్రమైన నొప్పి రావడం మొదలైంది. దాంతో రాళ్లను తొలగించి, పీయూజే అడ్డంకికి చికిత్స చేయడానికి ఎండోస్కొపిక్ మరియు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చేయాలని మా బృందం నిర్ణయించింది. మొత్తం చికిత్సకు రెండున్నర గంటల సమయం పట్టింది. ఎలాంటి సమస్య లేకుండా మొత్తం రాళ్లన్నింటినీ బయటకు తీయగలిగాం'
- పి. నవీన్ కుమార్, అవేర్ గ్లోబల్ ఆసుపత్రుల సీనియర్ కన్సల్టెంట్, హైదరాబాద్