తెలంగాణ రాష్ట్ర రాజధానిలో లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. రాత్రి వేళలోనూ ప్రయాణిస్తున్న వాహనదారులను పోలీసులు ఆపి ప్రశ్నిస్తున్నారు. రోడ్ల మీదకు రావడానికి అనుమతులున్నాయా లేదా అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా అమీర్‌పేట్, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద పోలీసు సిబ్బంది అర్ధరాత్రి రాకపోకలు సాగించే వాహనదారులు నిబంధనలకనుగుణంగా వ్యవహరిస్తున్నారా లేదా అనే అంశం పై దృష్టి సారిస్తున్నారు.
నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించి కేసు నమోదు చేస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే హైదరాబాద్ కమిషనరేట్‌లో లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై 6,533 కేసులు నమోదు చేసి.. 5,179 వాహనాలు జప్తు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి మొత్తం 8,042 కేసులు నమోదు చేశారు. మాస్కు ధరించని వారిపై 1,107 కేసులు, భౌతిక దూరం పాటించని 324 మందిపై, గుంపులుగా చేరిన 61 మందిపై, మద్యం తాగడం.. పొగాకు తయారీ పదార్థాలు వినియోగించిన 17 మందిపై కేసులు నమోదయ్యాయి.