ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐదేళ్ల కిందటి ఆశలేంటి?.. ఇప్పటి పరిస్థితులేంటి?

సరిగ్గా ఐదేళ్ల క్రితం.. 2015 అక్టోబరు 22న ఉద్ధండరాయునిపాలెం వద్ద రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అప్పటికే సింగపూర్‌కి చెందిన సుర్బానా, జురాంగ్‌ సంసలు సీఆర్‌డీఏ ప్రాంతానికి, రాజధాని నగరానికి, రాజధాని కేంద్ర ప్రాంతమైన సీడ్‌ క్యాపిటల్‌కు ప్రణాళికలు అందజేశాయి. నాటి ఆశలేంటి? నేటి పరిస్థితులేంటి?

5 years back modi laid foundation to amaravathi
5 years back modi laid foundation to amaravathi

By

Published : Oct 22, 2020, 12:35 AM IST

అమరావతి రాజధానికి శంకుస్థాపన తర్వాత... ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తై, వాటిలో కార్యకలాపాలు మొదలయ్యాయి. నాలుగేళ్లుగా రాష్ట్ర పరిపాలన అక్కడినుంచే సాగుతోంది. రాజధానిలో రహదారులు, బ్రిడ్జిలు వంటి ప్రధాన రహదారుల పనులకు టెండర్లు పిలవడం, పనులు ప్రారంభించడం, పరిపాలన నగరానికి ప్రణాళిక, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలకు ఆకృతుల రూపకల్పన వంటి పనులు చకచకా జరిగాయి. విట్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు వచ్చాయి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది. అమృత యూనివర్సిటీ నిర్మాణం మొదలైంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు, హైకోర్టు భవనాల పనులు మొదలయ్యాయి. శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు వేల సంఖ్యలో నివాస గృహాల టవర్ల నిర్మాణం చాలా వరకు కొలిక్కి వచ్చింది. మంత్రులు, న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణం మొదలైంది. ఏపీఎన్‌ఆర్‌టీ వంటి సంస్థలు తమ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాయి. అనేక హోటళ్లు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించారు.

రైతు ఉద్యమం

రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌లలో మౌలిక వసతుల పనులూ మొదలయ్యాయి. 2019 మే వరకు రాజధాని ప్రాంతం నిత్యం నిర్మాణ పనులతో, రణగొణ ధ్వనులతో కళకళలాడేది. వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు పూర్తిగా నిలిపివేయడం, మూడు రాజధానుల ప్రతిపాదన చేయడం, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయడం, అమరావతిలో కేవలం అసెంబ్లీ భవనాన్ని మాత్రమే ఉంచుతామని చెప్పడంతో.... 300 రోజులకుపైగా రాజధాని రైతుల ఉద్యమ నినాదాలతో అమరావతి గ్రామాలు హోరెత్తుతున్నాయి.

కేంద్రం హామీ..

సహకరిస్తామన్న హామీని కేంద్రం కొంత వరకు నిలబెట్టుకుంది. అమరావతి నిర్మాణానికి 10 వేల కోట్ల రూపాయలకుపైగా కేంద్ర సాయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 1500 కోట్లు, గుంటూరులో భూగర్భ మురుగునీటి పారుదల, విజయవాడలో వర్షపు నీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకి రెండు నగరాలకూ కలిపి 1000 కోట్లు నిధులిచ్చింది. ఆకర్షణీయ నగరాల అభివృద్ధి ప్రాజెక్టు కింద రాజధాని అమరావతికి మరో 800 కోట్ల రూపాయల వరకు నిధులిచ్చింది. రాజధానిలో ప్రస్తుతం ఉన్న సచివాలయం, శాసనసభ నిర్మాణానికి, మరికొన్ని పనులకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. రాజధానిలో పరిపాలన నగర నిర్మాణానికి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు రెండేళ్లపాటు క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు.

సింగపూర్ సంస్థల మాస్టర్ ప్లాన్​

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం ఏర్పడ్డాక... రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసమీకరణ, ప్రణాళికల రూపకల్పన, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పనులన్నీ ఒక పద్ధతి ప్రకారం, నిర్మాణాత్మకంగా, వేగంగా జరిగాయి. మనం సొంతానికి ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే కనీసం రెండేళ్లు పడుతుంది. అలాంటిది నాలుగేళ్లలోనే రాజధానికి భూ సమీకరణ, ప్రణాళికలు, ఆకృతుల రూపకల్పన కూడా పూర్తై, నిర్మాణాల ప్రక్రియ వేగంగా కొనసాగింది. సీఆర్‌డీఏకి, రాజధానికి, సీడ్‌ ఏరియాకి మాస్టర్‌ప్లాన్‌లు రూపొందించాలని సింగపూర్‌ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. సింగపూర్‌కి చెందిన సుర్బానా, జురాంగ్‌ సంస్థలు మాస్టర్‌ప్లాన్లు రూపొందించి ఇచ్చాయి. ప్రభుత్వం భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభించింది. రైతుల్ని ఒప్పించి, అటు వారికీ, ఇటు ప్రభుత్వానికి ఉభయతారకంగా ఉండేలా భూ సమీకరణ విధానాన్ని రూపొందించింది. 2015 జనవరిలో భూసమీకరణ మొదలు పెడితే... రెండు నెలల వ్యవధిలోనే 29 వేల మందికి పైగా రైతులు, 34 వేల ఎకరాల్ని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకార పత్రాలు అందజేశారు.

నిర్మాణంలో ఇతర దేశాల భాగం

2015 జూన్‌ నాటికి మాస్టర్‌ ప్లాన్లు సిద్ధమయ్యాయి. జీఐఐఎస్, ఆర్వీ అసోసియేట్స్‌ సంస్థలు రాజధానిలో మౌలిక వసతుల ప్రణాళికలు రూపొందించాయి. బ్రిటన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్స్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ పరిపాలన నగర ప్రణాళిక సిద్ధం చేసింది. వెలగపూడిలో ప్రస్తుత సచివాలయం, శాసనసభ, హైకోర్టు నిర్మాణం పూర్తయ్యాయి. రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల నిర్మాణానికి రూ.53 వేల కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. పనులు మొదలయ్యాయి. వివిధ దశల్లో ఉన్నాయి. 10 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులు ఖర్చయ్యాయి. 145 సంస్థలకు భూకేటాయింపు జరిగింది. విట్, ఎస్‌ఆర్‌ఎం తరగతులు ప్రారంభించాయి. రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణకు అవసరమైన ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అమరావతి బాండ్లు విడుదల చేస్తే... ఒకటి రెండు గంటల వ్యవధిలోనే 2 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకి ఆన్‌లైన్‌లో ఫ్లాట్‌లు బుకింగ్‌ నిర్వహిస్తే... కొన్ని గంటల వ్యవధిలోనే 1200 ఫ్లాట్‌లు బుక్కయ్యాయి. అమరావతి నిర్మాణంలో భాగం పంచుకోవడానికి సింగపూర్, జపాన్, బ్రిటన్‌ వంటి దేశాలు ముందుకు వచ్చాయి.

అమరావతిలో అసెంబ్లీ భవనం మాత్రమే..

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పనుల్ని ఎక్కడికక్కడ నిలిపేసింది. మూడు రాజధానుల చట్టం చేసింది. అమరావతిలో అసెంబ్లీ భవనాన్ని మాత్రమే ఉంచుతామని చెబుతోంది. జపాన్‌ మంత్రి యుసుకె టకారీ, ప్రధాని మోదీ చెప్పినట్టుగా... ఒక మహానగరాన్ని నిర్మించడం చాలా కష్టం.. అదే దాని విధ్వంసానికి మాత్రం ఒక్క రోజు సరిపోతుంది. అమరావతిలో అదే జరుగుతోంది. కొన్ని కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఒక్క కలం పోటుతో తెగిపడ్డాయి. అమరావతి పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఒక్క ఉత్తర్వుతో... రాష్ట్ర ప్రజల కలలన్నీ కుప్పకూలాయి.

అమరావతి ముంపు ప్రాంతమని ప్రచారం

అమరావతి ముంపు ప్రాంతమని, కృష్ణా నదికి వరదలు వస్తే అదంతా మునిగిపోతుందని కొందరు మంత్రులు, అధికార పార్టీ నాయకులు పదే పదే ప్రచారం చేశారు. అమరావతిని శ్మశానమని, అడవిలా ఉందని, గత ప్రభుత్వం గ్రాఫిక్స్‌ చూపించిందే తప్ప అక్కడేమీ నిర్మాణాలు జరగలేదని దుష్ప్రచారం చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, వేల కోట్ల రూపాయల భూముల లావాదావీలు అక్రమంగా జరిగాయని మరో ప్రచారం చేశారు. ఆ వ్యవహారాల్ని నిగ్గు తేల్చేందుకంటూ ఒక మంత్రుల సంఘాన్నీ, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

మూడు రాజధానులపై కమిటీలు

మరోపక్క రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన పేరుతో జీఎన్‌ రావు కమిటీని ప్రభుత్వం నియమించింది. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌కీ అదే బాధ్యతలు అప్పగించింది. ఆ రెండు కమిటీల నివేదికలు రాకముందే ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రస్తావన చేశారు. ఆ తర్వాత ఆ రెండు కమిటీలు వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి. రెండిటి సారాంశం మాత్రం మూడు రాజధానులే. అమరావతిలో శాసనసభ మాత్రం ఉంటే సరిపోతుందని చెప్పాయి.

అయోమయంలో అమరావతి

అమరావతిలో వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి చేసిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 16 నెలలుగా వాటిని అలా వదిలేయడంతో పాడవుతున్నాయి. పిచ్చి మొక్కలు మొలిచాయి. రాజధానిలో అంకుర ప్రాంతమైన స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన సింగపూర్‌ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూసి ఒప్పందం రద్దు చేసుకుని వెళ్లిపోయింది. అమరావతిలో జపాన్‌ ప్రభుత్వం వెయ్యి చదరపుమీటర్ల విస్తీర్ణంలో ‘హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌’ పేరుతో ఒక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. భవిష్యత్​లో రాజధానికి జపాన్‌ నుంచి పెట్టుబడులు ఆకర్షిచేందుకు అది ముఖద్వారంగా ఉపయోగపడుతుందని భావించారు. వాళ్లూ వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో... రాజధానికి 3,500 కోట్ల రూపాయల రుణం ఇచ్చే ప్రతిపాదనను ప్రపంచబ్యాంకు రద్దు చేసుకుంది. అమరావతి నగరం, అక్కడి ప్రజల భవిష్యత్తు ఇప్పుడు అయోమయంలో పడింది.

ఇదీ చదవండి:'చతుర్భుజ విన్యాసాల'తో చైనాకు చెక్​!

ABOUT THE AUTHOR

...view details