జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ శాతంపై అధికారులు స్పష్టతనిచ్చారు. 149 డివిజన్‌లకు జరిగిన ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఆర్సీపురం డివిజన్ లో 67.71 శాతం పోలింగ్ నమోదైంది.
యూసూఫ్‌గూడలో అత్యల్పం...
అత్యల్పంగా యూసూఫ్ గూడ డివిజన్లో 32.99 శాతం పోలింగ్ నమోదైంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి స్పల్పంగా ఓటింగ్ పెరిగింది. 2016 ఎన్నికల్లో 45.27 శాతంగా పోలింగ్ జరగగా ఈ సారి 1.28 శాతం పెరుగుదల నమోదైంది.
30 కేంద్రాల్లో...
శుక్రవారం జరిగే బల్దియా ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 30 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు చేపడతారు. లెక్కింపు కోసం 31 మందిని లెక్కింపు పరిశీలకులుగా నియమించారు.
పరిశీలకులు...
ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లను పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉదయం సమావేశం కానుంది. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఏసీపీ స్థాయి అధికారి విధుల్లో ఉంచి ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు.