Muthangi gurukul school Covid-19 Cases: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి వైరస్ నిర్ధరణ అయింది. గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉండగా.. ఆదివారం 261 మంది విద్యార్థులు.. 27 మంది సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. మిగతా విద్యార్థులకూ పరీక్షలు చేస్తున్నారు. వైరస్ సోకిన వారిని వసతి గృహంలోనే క్వారంటైన్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.
ఇటీవల మరో గురుకుల పాఠశాలలో కేసులు
corona cases in wyra gurukul school: ఇటీవలె మరో గురుకుల పాఠశాలలోనూ కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో కరోనా కలకలం రేగింది. 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతగా ఉండటంతో సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో ఆ విద్యార్థినికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ లక్ష్మి... విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా 27మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. తొలుత 13 మందికి పాజిటివ్ రాగా... ఆ తర్వాత మరో 14 మందికి సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారందరినీ ఇళ్లకు పంపించారు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఇళ్లకు తీసుకెళ్లారు.