రాష్ట్రంలో కొవిడ్ కేసుల ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను పాఠశాలలకు పంపడం సమస్యగా మారింది. ప్రభుత్వం ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే మొగ్గు చూపుతుండటంతో విద్యార్థులకు ఏం చేయాలో తోచని పరిస్థితి. చదువులో వెనకబడతారని బడికి పంపితే.. ఎక్కడ కరోనా సోకుతుందో అని తల్లిదండ్రుల ఆందోళన. ఇలా మహమ్మారి భయంతో గుంటూరు జిల్లాలో సగం మంది విద్యార్థులు పాఠశాలలకే హాజరుకాని దుస్థితి. చేసేదేమీ లేక వచ్చినవారితోనే ఉపాధ్యాయులు తరగతులు కానిచ్చేస్తున్నారు.
విద్యార్థుల హాజరు తగినంత లేకపోతే... అమ్మఒడి వంటి పథకాలు నిలిచిపోతాయనే భయంతో మరికొందరు పిల్లల్ని బడికి పంపుతున్నారు. పోనీ వీరికైనా సంరక్షణ ఉందంటే అంతంతమాత్రమే. కరోనా తొలినాళల్లో తీసుకున్న జాగ్రతలు.. ఇప్పుడు ఎక్కడా కన్పించడం లేదు. చాలా పాఠశాలల్లో ఉష్ణోగ్రతను కొలిచే థర్మల్ స్రీన్లు లేవు. బడుల్లో శానిటేషన్ కూడా చేయడం లేదు. వైరస్ వ్యాప్తి వేళ పిల్లలను బడికి పంపమని తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారు. వారి ఆరోగ్య భద్రతకు ఎవరు బాధ్యులని నిలదీస్తున్నారు.