సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకులాల్లో కొత్తగా 3, 4 తరగతులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకులాల్లో ప్రస్తుతం అయిదో తరగతి నుంచి ఇంటరు వరకు ఉంది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య, 1, 2 తరగతులు కలిపి ఒక యూనిట్‌గా, 3 నుంచి ఇంటరు వరకు ఒక యూనిట్‌గా ఉండాలి. అందులో భాగంగానే 3, 4 తరగతులను చేర్చాలని యోచిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుచేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
జాతీయ విద్యా విధానంపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆయా సంక్షేమశాఖలతో ఈ విషయాన్ని విద్యాశాఖ చర్చించింది. అదనపు తరగతులను చేర్చితే ప్రవేశాలు భారీగా పెరిగే అవకాశముంది. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకులాలు 189, బీసీలవి 93, గిరిజన గురుకులాలు 189 ఉన్నాయి. వీటిలో ఏటా ఒక్కో తరగతిలో 80 మందికి ప్రవేశాలను కల్పిస్తున్నారు.