ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నది ఒకప్పటి సామెత. రెండింటిలోనూ వ్యయప్రయాసలు ఉంటాయని దానర్థం. పెరుగుతున్న సిమెంట్, ఇసుక ధరలతో సామాన్యుడికి సొంతిల్లు తీరని కలగానే మిగులుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఒజాజ్ అనే సంస్థ దేశంలో మొదటిసారి తక్కువ ధరలో... అతి తక్కువ సమయంలో 3డీ ఇంటి నిర్మాణాలు చేపడతామంటూ ముందుకొచ్చింది.
ఖర్చు తక్కువ... మన్నికెక్కువ...
రోబోటిక్ త్రీడీ సాంకేతికత పరిజ్ఞానంతో వారం రోజుల్లో ఇళ్లు కట్టవచ్చు. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ ఇంటికి తెలంగాణ వేదికైంది. సిద్దిపేట జిల్లా బండమైలారంలో ఒజాజ్ అనే సంస్థ దేశంలోనే మొట్టమొదటి నమూనా ఇంటిని నిర్మించింది. సాంప్రదాయక నిర్మాణ వ్యయం కంటే దాదాపు 20 నుంచి 30శాతం తక్కువ ఖర్చుతో.. అనేక రెట్లు మన్నికగా నిర్మించడం దీని ప్రత్యేకత.
రష్యా నిపుణుల సహకారం...
సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం శివారులో ఈ సాంకేతికతను ఉపయోగించి వంద చదరపు అడుగుల్లో నిర్మించిన గదిని శుక్రవారం మీడియా ముందు ప్రదర్శించారు. రష్యా నిపుణుల సహకారం తీసుకున్నట్లు చెప్పిన సంస్థ సీఈవో జాషువా ఇందులో వాడే ప్రతి విడిభాగాలను భారత్లోనే తయారు చేస్తున్నట్లు తెలిపారు.