రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరికపై విధించిన గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా కొద్ది మంది సిబ్బంది మాత్రమే విధుల్లో చేరారు. మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లోకి చేరకపోతే... మిగిలిన బస్సులను కూడా ప్రైవేటుపరం చేస్తామని శనివారం రాత్రి సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పొద్దుపోయేవరకు మొత్తం 360 మంది విధుల్లో చేరేందుకు లేఖలిచ్చినట్లు సమాచారం.
మొత్తం 360మంది
తిరిగి విధుల్లో చేరిన వారిలో బస్భవన్లోని పరిపాలన సిబ్బంది 200 మంది వరకు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 62మంది, హైదరాబాద్ జోన్లో 31మంది, ఇతర డిపోల పరిధిలో మిగిలిన వారు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారికంగా ప్రకటించలేదు. ఇవాళ పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.