ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

3 వేల మందికి పునర్జన్మ ప్రసాదించిన 'గాంధీ' ఆసుపత్రి - గాంధీ ఆసుపత్రి తాజా వార్తలు

కొవిడ్‌తో ఆరోగ్యం విషమించి క్లిష్ట పరిస్థితిలో గాంధీ ఆసుపత్రిలో చేరిన వారు ఎంతోమంది ఉన్నారు. దవాఖానాకు వచ్చే ముందు ఏదో తెలియని భయం.. తిరిగి క్షేమంగా ఇంటికి చేరతామా.. లేదా.. అనే ఆందోళన. ఇలాంటి చాలామంది కరోనా నుంచి క్షేమంగా బయట పడుతున్నారు. తాజాగా బుధవారం 89 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. పది రోజుల నుంచి మొత్తం 700-800 మందికి గాంధీ ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది.

Gandhi hospital
Gandhi hospital

By

Published : May 20, 2021, 11:05 AM IST

రెండో విడత కరోనా విజృంభణ తర్వాత మార్చి నెలాఖరు నుంచి ఇప్పటివరకు దాదాపు 3 వేల మంది కరోనా నుంచి కోలుకొని ఇంటిబాట పట్టారు. వీరందరికీ గాంధీ ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. కరోనా పాజిటివ్‌గా వస్తే చాలు...ఇక అంతా అయిపోయిందనుకునే వారికి వీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆక్సిజన్‌ శాతం 85 కంటే కిందకు పడిపోయి.. తీవ్ర ఆయాసంతో చేరిన వీరంతా గాంధీలో చికిత్సలతో తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నారని వైద్యులు చెబుతున్నారు. తాజాగా బుధవారం 89 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్ఛార్జ్‌ అయ్యారు. పది రోజుల నుంచి మొత్తం 700-800 మంది వైరస్‌ నయమై ఇంటిబాట పట్టారు.

తీవ్ర అనారోగ్యంతో..

సాధారణ కొవిడ్‌ లక్షణాలతో ఎవరూ గాంధీని ఆశ్రయించడం లేదు. ఇతర ప్రైవేటు ఆసుపత్రులు లేదంటే ఇంటివద్దే 10-12 రోజులపాటు చికిత్స తీసుకొని అక్కడ ఆరోగ్యం విషమించిన తర్వాత గాంధీకు వస్తున్నారు. కొందరు చికిత్సలతో కోలుకుంటున్నారు. మరికొందరికి పరిస్థితి విషమించి కన్నుమూస్తున్నారు. మృతుల్లో యవకుల నుంచి వృద్ధుల వరకు ఉంటున్నారు. ప్రస్తుతం 1200 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఇందులో 650 మంది వరకు ఐసీయూలో ఉన్నారు. ఇందులో 85 శాతం మంది ఇలా ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చిన వారే.

వృద్ధులు కోలుకుంటున్నారు..

కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారిలో అన్ని వయస్సులు వారూ ఉంటున్నారు. వృద్ధులకు కరోనా సోకితే కష్టమే అన్నది అపోహే. ఇటీవలి 110 ఏళ్ల వయస్సున్న ఓ వృద్ధుడు కరోనాతో గాంధీలో చేరాడు. చికిత్స తర్వాత కోలుకొని ఇంటి బాట పట్టారు. ఇప్పటివరకు కోలుకున్న వారిలో 40 శాతం మంది 60 ఏళ్లు ఆపై వయస్సున్న వాళ్లు ఉన్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. మిగతా వారిలో 20-50 వయస్సు వాళ్లు ఉంటున్నారు. ముందే లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకున్న వారిలో 90 శాతం మందికి ఎలాంటి ముప్పు ఉండటం లేదన్నారు. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న సంతోషం కూడా చాలామందికి దక్కడం లేదు. గాంధీలో క్రమంగా మ్యూకోర్‌మైకోసిస్‌(బ్లాక్‌ఫంగస్‌) కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 20 మంది కరోనా రోగులకు బ్లాక్‌ఫంగస్‌ సోకింది. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా మారింది.

ఇదీ చూడండి:

రోగ నిరోధక శక్తి బాగుంటే బ్లాక్ ఫంగస్‌ రాదు: డాక్టర్ శంకర్ ప్రసాద్‌

ABOUT THE AUTHOR

...view details