ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేటు డిగ్రీ, పీజీ కోర్సుల్లో యాజమాన్య కోటా నిర్ణయం.. ఫీజు ఎంతంటే? - ap latest news

ప్రైవేటు డిగ్రీ, పీజీ కోర్సుల్లో యాజమాన్య కోటా(కేటగిరీ-బీ)ను ఉన్నత విద్యాశాఖ ఖరారు చేసింది. అది ఎంత శాతం ఉండాలో.. ఫీజు ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డిగ్రీ, పీజీలో పూర్తిగా కన్వీనర్‌ కోటానే ఉండగా.. ఇప్పుడు యాజమాన్య కోటాను తీసుకొచ్చింది.

30-percent-ownership-quota-in-private-degree-and-pg-courses
ప్రైవేటు డిగ్రీ, పీజీ కోర్సుల్లో 30% యాజమాన్య కోటా

By

Published : Oct 8, 2021, 11:54 AM IST

ప్రైవేటు డిగ్రీ, పీజీ కోర్సుల్లో యాజమాన్య కోటాను అమలు చేస్తున్నట్టు ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు డిగ్రీ, పీజీలో పూర్తిగా కన్వీనర్‌ కోటా ఉండగా.. ఈ ఏడాది నుంచి యాజమాన్య కోటాను తీసుకొచ్చింది. 30% సీట్లు యాజమాన్య కోటా(కేటగిరీ-బీ) కింద భర్తీ చేయనున్నట్టు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీచేశారు. ఎయిడెడ్‌ కళాశాలల్లోని అన్‌ ఎయిడెడ్‌ సెక్షన్లు, ప్రైవేటు స్వయం ప్రతిపత్తి కళాశాలల్లోని కోర్సులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

మూడింతల ఫీజు..
కన్వీనర్‌ కోటా(కేటగిరీ-ఏ)కు ఉన్నతవిద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించిన ఫీజులపై.. మూడింతల వరకు యాజమాన్య కోటా (కేటగిరీ-బీ)కింద వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. కన్వీనర్‌ భర్తీ చేసిన తర్వాత మిగిలే సీట్లను కళాశాలల యాజమాన్యాలు స్పాట్‌లో యాజమాన్య కోటా కింద భర్తీ చేసుకోవచ్చు. యాజమాన్య కోటా సీట్లనూ ఆన్‌లైన్‌లో మెరిట్‌ ఆధారంగా కన్వీనరే భర్తీ చేస్తారు. ఈ కోటాలో చేరిన వారికి బోధన రుసుములు చెల్లించరు.

యాజమాన్య కోటా వల్ల పేద విద్యార్థులకు నష్టం ఏమీ ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో 80% వరకు గ్రామీణంలో ఉండగా.. వీటిల్లో 70% లోపు సీట్లే భర్తీ అవుతున్నాయని తెలిపారు. అందువల్ల 30% యాజమాన్య కోటా వల్ల పేద విద్యార్థులకు నష్టం వాటిల్లబోదని పేర్కొన్నారు. ఇక, వచ్చే మూడేళ్లలో అన్ని ప్రైవేటు కళాశాలలూ తప్పనిసరిగా న్యాక్‌ గుర్తింపు పొందాలని, ప్రస్తుతం మొత్తం కళాశాలల్లో 1% కళాశాలలకు మాత్రమే అక్రెడిటేషన్‌ ఉందని పేర్కొన్నారు.

డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌..
డిగ్రీలో కన్వీనర్‌ కోటా సీటు పొందేందుకు.. ఆన్‌లైన్‌లో 10వ తేదీ నుంచి 15 వరకూ వెబ్‌ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చు. 20న సీట్లు కేటాయిస్తారు. తమకు కేటాయించిన కళాశాలల్లో విద్యార్థులు 21న చేరాలి. కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపు పూర్తయ్యాక యాజమాన్య కోటా (కేటగిరి-బీ) సీట్ల భర్తీ చేపట్టనున్నారు.

ఇదీ చూడండి:MAA Elections: 'చీకటి యుగంలో బతుకుతున్నారా?'

ABOUT THE AUTHOR

...view details