ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ ప్రాంతాల్లో 6 నెలల్లో అనుమతులు పొందాలన్న కేంద్రం.. కష్టమే అంటున్న ఇంజినీర్లు!

కేటాయింపులు లేని కృష్ణా బేసిన్​లో 30 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు (Irrigation Projects) ఆరు నెలల్లో అనుమతులు పొందాలని కేంద్రం స్పష్టం చేసింది. లేకుంటే ఆ ప్రాజెక్టులు నిలిపివేస్తామని తెలిపింది. మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు ప్రస్తుతానికి నీటి లభ్యత ఉండే అవకాశం లేదు కాబట్టి గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు ఆరు నెలల్లో అనుమతులు తెచ్చుకునే అవకాశం నామమాత్రమేనని ఇంజినీర్లు చెబుతున్నారు.

Krishna Basin
కృష్ణా బేసిన్​

By

Published : Jul 17, 2021, 9:52 AM IST

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల(Irrigation Projects)కు ఆరు నెలల్లో అనుమతులు పొందడం సాధ్యమేనా? అదీ కేటాయింపులు లేని కృష్ణా బేసిన్‌లో ఎలా వీలవుతుందని నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలల్లోగా అనుమతులు పొందకపోతే, సదరు ప్రాజెక్టులను నిలిపేస్తామని కేంద్రం.. కృష్ణా, గోదావరి పరిధికి సంబంధించిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయి ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నవి కాగా, కొన్ని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నవి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు నోటిఫికేషన్‌ అమలు చేయడం వీలవుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఈనెల 15న నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ప్రచురించినందున జనవరి 15లోగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు ప్రాజెక్టుల (Irrigation Projects)కు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇందులో కృష్ణా బేసిన్‌లో 16 ప్రాజెక్టులున్నాయి. ఆంద్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014లోని 11 షెడ్యూల్‌లో తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను పేర్కొని, నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదని స్పష్టంచేశారు. ఇందులో శ్రీశైలం ఎడమగట్టుకాలువ (ఎస్‌.ఎల్‌.బి.సి) పేరు లేకపోవడంతో దానిని చేర్చాలని పునర్విభజనకు ముందే ఉమ్మడి ఏపీ కేంద్రానికి లేఖ రాసింది. 11వ షెడ్యూల్‌లో ఈ ప్రాజెక్టులు ఉండగా, తాజా నోటిఫికేషన్‌లో ఆరు నెలల్లోగా అనుమతులు తెచ్చుకోకపోతే నిలిపివేస్తామని పేర్కొనడం పట్ల ఇంజినీరింగ్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

ఇందులో.. నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీనీవా, తెలుగుగంగ ప్రాజెక్టుల (Irrigation Projects) కింద ఆయకట్టుకు నీళ్లు సైతం అందుతున్నాయి. వెలిగొండ పూర్తి కావొచ్చింది. తాజా నోటిఫికేషన్‌లో 2014 చట్ట ప్రకారం అని పేర్కొన్న జాబితాలో వెలిగొండను చేర్చలేదు. అలాగే ఎస్‌.ఎల్‌.బి.సి లేదు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ పని చేపట్టక ముందే దీనికి ప్రత్యామ్నాయంగా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేశారు. గత దశాబ్దకాలంగా సుమారు మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తోంది. దీన్ని అనుమతి లేని ప్రాజెక్టుగా పేర్కొనడం ఒక ఎత్తైతే.. ఆరు నెలల్లోగా అనుమతి పొందకపోతే నిలిపివేస్తామని పేర్కొనడం ఎలా సబబని ఆ ప్రాజెక్టులో పని చేసిన ఓ ఇంజినీర్‌ ప్రశ్నించారు.

90 టీఎంసీలతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, 30 టీఎంసీలతో చేపట్టిన డిండితోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌.ఎల్‌.బి.సి నీటి సామర్థ్యం పెంపు, సిద్దాపురం, భక్తరామదాసు, తుమ్మిళ్ల, మునియేరు పునరుద్ధరణ తదితర ప్రాజెక్టులను అనుమతుల్లేని ప్రాజెక్టుల్లో కేంద్రం చేర్చింది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేయడం, క్యారీ ఓవర్‌ను, గోదావరి నుంచి మళ్లించగా ఉమ్మడి ఏపీ వాటాగా వచ్చే 45 టీఎంసీలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసినప్పుడు కొన్ని ప్రాజెక్టులకు నీటి కేటాయింపు వచ్చే అవకాశం ఉంది. మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు ప్రస్తుతానికి నీటి లభ్యత ఉండే అవకాశం లేదు కాబట్టి గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు ఆరు నెలల్లో అనుమతులు తెచ్చుకునే అవకాశం నామమాత్రమేనని చెబుతున్నారు.

గోదావరిలో..

గోదావరిలో నీటి లభ్యత ఉంది. వరద జలాల ఆధారంగా చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు(Irrigation Projects) ఉన్నాయి. పోలవరం పూర్తవడంలో జాప్యం జరుగుతోంది కాబట్టి ఈ లోగా నీటిని వినియోగించుకోవడానికి చేపట్టినవీ ఉన్నాయి. వీటన్నింటికీ ఆరు నెలల్లో అనుమతులు తెచ్చుకోవాల్సిందే. గోదావరిలో కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, ప్రాణహిత ప్రాజెక్టు, ముక్తేశ్వర్‌(చిన్న కాళేశ్వరం), చింతలపూడి, పట్టిసీమ, పురుషోత్తమపట్నం తదితర ప్రాజెక్టులున్నాయి. పట్టిసీమ ద్వారా గత నాలుగేళ్లుగా నీటిని మళ్లిస్తున్నారు.

రెండు బోర్డుల పరిధిలో

తుంగభద్ర ప్రాజెక్టు(Irrigation Projects)కు ప్రత్యేకంగా బోర్డు ఉంది. ఈ బోర్డు పరిధిలో ఉన్న తుంగభద్ర హెచ్చెల్సీ, ఎల్లెల్సీలను ఇప్పుడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తెచ్చారు. దీంతో ఈ రెండు కాలువలు రెండు బోర్డుల పరిధిలోకి వచ్చినట్లయింది.

ఇదీ చదవండి:

'అవి.. బోర్డు పరిధిలోకి అవసరం లేదు': కేంద్ర గెజిట్​పై సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details