Voter List Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితా ప్రకారం.. మొత్తం 3 కోట్లా 3 లక్షలా 56 వేలా 894 మంది ఓటర్లున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకుగానూ 11 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య లక్ష నుంచి రెండు లక్షల మధ్య ఉంది. 90 నియోజకవర్గాల్లో ఈ సంఖ్య రెండు నుంచి మూడు లక్షల మధ్య ఉంది. తొమ్మిది నియోజకవర్గాల్లో మూడు నుంచి నాలుగు లక్షల మధ్య.. మూడు నియోజకవర్గాల్లో నాలుగు నుంచి ఐదు లక్షల మధ్య ఓటర్లున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో ఐదు నుంచి ఆరు లక్షల మధ్య ఓటర్లు ఉండగా... రెండు నియోజకవర్గాల్లో మాత్రం ఓటర్ల సంఖ్య ఆరు లక్షల మార్కును దాటింది.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6 లక్షలా 64 వేలా 120 మంది ఓటర్లున్నారు. 6 లక్షలా 29వేలా 619 మంది ఓటర్లతో కుత్బుల్లాపూర్ రెండో స్థానంలో ఉంది. 5,68,678 మంది ఓటర్లతో మేడ్చల్.. 5,57,081 మంది ఓటర్లతో ఎల్బీనగర్... 5,06,646 మంది ఓటర్లతో ఉప్పల్... 5,02,796 మంది ఓటర్లతో రాజేంద్రనగర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహేశ్వరం, మల్కాజిగిరి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య నాలుగు లక్షలకు పైగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ జిల్లాలో 43 లక్షలకు పైగా ఓటర్లున్నారు. రంగారెడ్డిలో 31 లక్షలకుపైగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 26 లక్షలకు పైగా ఓటర్లున్నారు. ఈ మూడు జిల్లాలు కలిపితే ఓటర్లసంఖ్య ఒక కోటికి పైగా ఉన్నారు.