అవయవ దానంలో దేశవ్యాప్తంగా మూత్రపిండాలే అత్యధిక సంఖ్యలో ఉంటున్నాయి. తమ సొంత కుటుంబ సభ్యుల ఔదార్యంతో బాధితులు తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ 2020-21 నివేదిక ప్రకారం... కిందటేడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు దేశవ్యాప్తంగా 1,884 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. వీటిలో 1,370 (72.71%) కిడ్నీల మార్పిడివే కావడం గమనార్హం. ఇందులో కుటుంబ సభ్యులు ఇచ్చిన మూత్రపిండాలతో చేసినవి 1,269 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 27 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు కిడ్నీలకు సంబంధించినవే కావడం గమనార్హం. తెలంగాణలో 141 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగితే అందులో 65 కిడ్నీ, 50 కాలేయ, ఇతరాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులే బాధితులకు అవయవాల దానానికి ముందుకొస్తే... ఆంక్షలు తక్కువగా ఉంటాయి. ఇతరుల నుంచి పొందాలంటే... కఠిన ఆంక్షలు ఉంటాయి. బ్రెయిన్‌డెడ్ ప్రకటించిన వ్యక్తుల నుంచి అవయవాలు పొందాలన్నా.. తగిన సమయం ఉండాలి. అధిక వ్యయమూ అవుతుంది. జీవన్‌దాన్ జాబితాలోని సినియారిటీని అనుసరించి బ్రెయిన్‌డెడ్ కేసుల నుంచి అవయవాల మార్పిడి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బాధితులకు కిడ్నీలు ఇచ్చేందుకు కుటుంబ సభ్యులే ముందుకొస్తే... వైద్యులు పరీక్షించి అమరుస్తున్నారు.
ఏపీలో మూత్రపిండాల మార్పిడికే అవకాశం
దేశవ్యాప్తంగా 516 ఆసుపత్రుల్లో అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలకు అనుమతి ఉంది. బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించిన వ్యక్తుల నుంచి అవయవాలు తీసి, వేరు చేయాలంటే ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు ఉండాలి. ఈ సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్‌లో కొరవడ్డాయి. అందువల్లే... ఇక్కడ కిడ్నీల శస్త్రచికిత్సలు మాత్రమే జరుగుతున్నాయి.