ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెళ్లి కావడం లేదని.. 2,331 మంది బలవన్మరణం - తెలంగాణలో ఆత్మహత్యలు

దేశంలో ఆత్మహత్యల పరంగా 2019 కొత్త రికార్డు నమోదు చేసింది. గత 11 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా 1,39,123 మంది గత ఏడాది బలవన్మరణానికి పాల్పడ్డారు. జాతీయ నేర గణాంకాల మండలి (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

2331-committed-suicide-for-not-getting-married-in-india
దేశంలో పేదల ఆత్మహత్యలే ఎక్కువ

By

Published : Sep 7, 2020, 9:56 AM IST

పేదలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. ఈ జాబితాలో ఏడాదికి రూ.లక్షలోపు ఆదాయం ఉన్న నిరుపేదలు 66.2 శాతం(92,083), లక్ష నుంచి రూ.5 లక్షలలోపు ఆదాయమున్న వారు మరో 29.6 శాతం(41,197) ఉన్నారు. మొత్తం ఆత్మహత్యల బాధితుల్లో రూ.5 లక్షలలోపు ఆదాయమున్న పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలే 95.8 శాతం ఉండటం గమనార్హం. అలానే 70 శాతం మంది తక్కువ చదువుకున్నవారేనని ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో నిరక్షరాస్యులు 12.6%, ప్రాథమిక అక్షరజ్ఞానమున్నవారు 16.3%, ఉన్నత పాఠశాల విద్య చదివినవారు మరో 42.9% ఉన్నారు. పెళ్లీడొచ్చినా వివాహం కావడంలేదని 2,331 మంది ఉరితాడు బిగించుకున్నారు.

అత్యధికం: గతంలో అత్యధికంగా 2011లో 1,35,585 బలవన్మరణాలు నమోదయ్యాయి. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 2017లో అత్యల్పంగా 1,29,887 ఆత్మహత్యలు జరిగాయి. రెండేళ్లలో 1.39 లక్షల బలవన్మరణాలతో కొత్త రికార్డు నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో: గతేడాది తెలంగాణలో 7,675 మంది, ఏపీలో 6,465 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం ఆత్మహత్యల్లో 10 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే జరిగాయి. హైదరాబాద్‌ నగరంలో 389 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.

సగటు పరంగా మూడో స్థానంలో తెలంగాణ: ప్రతి లక్ష మంది జనాభాకు ఆత్మహత్య చేసుకుంటున్నవారి జాతీయ సగటు 10.4 కాగా.. తొలి 3 స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌ (26.4), కేరళ (24.3), తెలంగాణ (20.6) ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో ఆత్మహత్యల సగటు జాతీయ సగటు కన్నా ఎక్కువ ఉండటం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details