ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'హేమంత్ హత్యోదంతం: 21కి పెరిగిన నిందితుల సంఖ్య'

తెలంగాణలో సంచలనం సృష్టించిన హేమంత్ పరువు హత్యోదంతంలో రోజురోజుకు విస్తుపోయే నిజాలు బయటికొస్తున్నాయి. యువకుడిని హతమార్చేందుకు గతంలోనే పలుమార్లు రెక్కి నిర్వహించిన ఓ గ్యాంగ్‌.... అనంతరం తప్పుకుంది. దీంతో అందుబాటులో ఉన్న మరికొందరితో కలిసి యుగేంధర్‌రెడ్డి ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 14మందిని అరెస్టు చేయగా... మరో ఏడుగురిని విచారిస్తున్నారు.

hemanth-murder-case
హేమంత్ హత్యోదంతం

By

Published : Sep 29, 2020, 8:34 AM IST

ప్రేమించి పెళ్లి చేసుకుని హత్యకు గురైన హేమంత్ హత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. అవంతి-హేమంత్‌ వివాహం జరిగిన నాటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలపై దృష్టి సారించారు. జూన్ 10న ఓ ఆలయంలో వీరు పెళ్లి చేసుకోగా... కుమార్తెను మొదట్లో తమవైపు తిప్పుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో... హేమంత్‌ను కిడ్నాప్‌ చేసి బెదిరిస్తే దారికొస్తారని భావించారు. ఇందుకోసం 2 నెలల క్రితం అవంతి మేనమామ యుగేంధర్‌రెడ్డి ఓ గ్యాంగ్‌ను సంప్రదించి... రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం పలుమార్లు రెక్కీ నిర్వహించి... గ్యాంగ్‌కు ఫోన్‌చేయగా వారు వాయిదా వేశారు. తర్వాత కూడా వారి నుంచి స్పందన లేకపోవటంతో... గతంలో తాను పనిచేసిన ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ పేకాట శిబిరాలు నిర్వహించే బిచ్చుయాదవ్‌, ఆట్‌డ్రైవర్ మహమ్మద్ పాషా, ఎరుకల కృష్ణ పరిచయమయ్యారు. వారికి డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న యుగేంధర్‌రెడ్డి.... రూ.10 లక్షలు ఇస్తానని చెప్పి హేమంత్‌ను కిడ్నాప్​ చేయాలని సూపారి ఇచ్చాడు.

కిడ్నాప్‌ కేసు పెడతానని..

ఈ నెల 24న యుగేంధర్‌రెడ్డితో కలిసి హేమంత్ ఇంటికి వెళ్లిన గ్యాంగ్‌ అక్కడి నుంచి దంపతులిద్దరిని కారులో ఎక్కించుకున్నారు. అనుమానంతో అవంతి కారులో నుంచి దూకగా... హేమంత్‌ను బలవంతంగా కారులో తీసుకువెళ్లారు. అమ్మాయిని వదిలేయాలని యుగేంధర్‌రెడ్డి బేరసారాలాడగా... తనకు డబ్బు అవసరం లేదని తేల్చిచెప్పాడు. అనంతరం అందరిపై కిడ్నాప్‌ కేసు పెడతానని చెప్పటంతో ఆందోళనకు గురైన రౌడిగ్యాంగ్.... హేమంత్‌ను హతమార్చేందుకు నిర్ణయించుకున్నారు.

కారులోనే హతమార్చారు!

జహీరాబాద్‌లో మద్యం సేవించి... కారులోనే యువకుడి చేతులు, కాళ్లు కట్టేసి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కాగా... ఈ కేసులో నిందితులు సంఖ్య 21కి పెరిగింది. ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఇందులో ప్రమేయమున్న కృష్ణ , పాషా, జగన్​, సయ్యద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు అవంతి సోదరుడు ఆశీశ్‌రెడ్డి, సందీప్‌తో పాటు మరో వ్యక్తి ప్రమేయం ఉందని తేలడంతో వారిని కూడా నిందితులుగా చేర్చారు. జైలులో ఉన్న యుగేంధర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అర్చన, బిచ్చుయాదవ్‌తో పాటు మిగిలిన నిందితులను కస్టడికి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

సర్వత్రా నిరసనలు

మరోవైపు పరువు హత్యను ఖండిస్తూ సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు.... అవంతికకు మద్దతుగా ర్యాలీ నిర్వహించాయి. హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించి... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:పరువు హత్య: పరారీలో ఉన్న కీలక నిందితుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details